టీచర్లపై టెట్‌ భారం తొలగించాలి

2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

శ్రీ వైయ‌స్ జగన్ ట్వీట్‌

తాడేపల్లి: 2011కు ముందు నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్షను తప్పనిసరి చేయడం అన్యాయమని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, జాతీయ విద్యాహక్కు చట్టంలో సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

టెట్‌ అమల్లోకి రాకముందే కఠినమైన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయులుగా నియమితులైన వారిని ఇప్పుడు మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలని, అందులోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని శ్రీ వైయ‌స్ జగన్ ప్రశ్నించారు. 20 నుంచి 25 ఏళ్లుగా సేవలందిస్తున్న సబ్జెక్టు టీచర్లను అన్ని సబ్జెక్టులపై టెట్‌ పరీక్ష రాయాలని బలవంతపెట్టడం వల్ల దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

టెట్‌ నిబంధన కారణంగా పదోన్నతులు నిలిచిపోవడంతో పాటు ఉద్యోగ భద్రతపై కూడా అనిశ్చితి నెలకొందని, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం బాధాకరమన్నారు.

2011కు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులందరికీ టెట్‌ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీ వైయ‌స్ జగన్ డిమాండ్ చేశారు. అప్పట్లో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాతే వారికి ఉద్యోగాలు లభించాయని, ఆ విషయాన్ని గుర్తుంచుకుని ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

 

Back to Top