మార్కాపురం: డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధిని దెబ్బతీస్తూ పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దోపిడీకి ద్వారాలు తెరవడమేనని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మండిపడ్డారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం డాక్యుమెంట్ రైటర్ల జీవితాల్లో అశనిపాతంలా మారిందన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్‌డౌన్ నిరసనకు గురువారం మార్కాపురంలో అన్నా రాంబాబు సంఘీభావం ప్రకటించారు. వైద్యం, విద్య వంటి కీలక సేవల నుంచి ప్రతి రంగాన్నీ ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. చివరకు ప్రభుత్వాన్ని కూడా పీపీపీ విధానంలో నడుపుతారేమోనని ఎద్దేవా చేశారు. ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పునరాలోచించి సంబంధిత జీవోను ఉపసంహరించుకుని డాక్యుమెంట్ రైటర్లకు న్యాయం చేయాలని అన్నా రాంబాబు కోరారు.