చిన్నారి వైద్య ఖర్చులకు వాసుపల్లి రూ.20 వేల సాయం

 కేజీహెచ్ వైద్యుల చికిత్సతో చిన్నారి గగన్‌కు భరోసా

 ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్

విశాఖపట్నం: పుట్టినప్పటి నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారి వంక గగన్‌కు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చొరవతో కేజీహెచ్‌లో వైద్య చికిత్స అందించారు. అనంతరం చిన్నారి ఇంటికి వెళ్లి పరామర్శించిన వాసుపల్లి, వైద్య ఖర్చుల కోసం తన సొంత నిధుల నుంచి రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు.

కేజీహెచ్ సూపరింటెండెంట్ సహకారంతో కిడ్నీ వైద్య నిపుణుడు గులిపిల్లి ప్రసాద్ బృందం పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందించినట్లు వాసుపల్లి తెలిపారు. చిన్న వయసులో కిడ్నీ మార్పిడి అనుకూలం కాదని వైద్యులు సూచించడంతో, ప్రస్తుతం ట్యూబ్ ద్వారా పదేళ్ల వయసు వరకు ఆరోగ్యవంతమైన జీవనం సాగించేలా చికిత్స అందించారని పేర్కొన్నారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించిన కేజీహెచ్ వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారి తల్లిదండ్రులు వంక నరేష్, అమ్మాజీ నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో మందులు, ఇతర వైద్య ఖర్చుల కోసం తనవంతుగా సాయం అందించినట్లు చెప్పారు. గగన్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, వైయస్ జగన్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తరించారని వాసుపల్లి పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top