దళిత మహిళ గంగమ్మది పక్కా కస్టోడియల్ డెత్

చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్న 'సిట్' దర్యాప్తు

వైయస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ ఆరోపణ.

కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసుల కట్టుకథలు.

రాష్ట్రంలో పౌరహక్కులు, రాజ్యాంగ విలువలు పూర్తిగా మంటకలిశాయి: సాకే శైలజానాధ్, మనోహర్ రెడ్డి.

కర్నూలు జిల్లా కౌతాళం మండలం బద్దెనహల్ గ్రామంలో పర్యటించిన వైయ‌స్సార్‌సీపీ నిజనిర్దారణ కమిటి. అనంత‌రం కర్నూలు పార్టీ కార్యాలయంలో  మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శైలజానాధ్, వైయ‌స్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి

కర్నూలు: కూటమి ప్రభుత్వంలో దళితులు, బలహీన వర్గాలపై పోలీసుల అణచివేత, దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని, దళిత మహిళ గంగమ్మ మృతి పక్కా కస్టోడియల్ డెత్‌ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైయస్సార్‌సీపీ అధినేత వైయస్. జగన్ఆదేశాల మేరకు కౌతాళం మండలం బద్దెనహల్ గ్రామంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటించింది. అనంతరం కర్నూలులో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాధ్ మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు పేరుతో పోలీసులు సాగించిన శారీరక, మానసిక హింస వల్లే గంగమ్మ ప్రాణాలు కోల్పోయిందని, ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తన సొంత 'సిట్ టీమ్‌తో కట్టుకథలు అల్లిస్తోందని వారు విమర్శించారు. ఈ లాకప్ డెత్ ఘటనతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న వరుస దౌర్జన్యాలపై సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐ ద్వారా నిష్పాక్షిక విచారణ జరిపించాలని కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

- లాకప్ డెత్‌లపై ముఖ్యమంత్రి నోరు విప్పాలి
: మాజీ మంత్రి సాకే శైలజానాథ్

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మృతులు, లాకప్ డెత్‌లపై లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే ముఖ్యమంత్రి స్పందించాలి. కౌతాళం మండలం బద్దెనహల్ గ్రామంలో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ ఘటనపై వైయస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ ఇవాళ పర్యటించింది.  ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం పౌరులకు జీవించే హక్కును కల్పించింది, కూటమి ప్రభుత్వంలో మాత్రం ప్రాథమిక హక్కులు పూర్తిగా అడుగంటిపోయాయి. కొడుకు అదృశ్యమయ్యాడని కంప్లైంట్ ఇచ్చిన తల్లిని కస్టోడియల్ టార్చర్ ద్వారా పొట్టనపెట్టుకున్నారు. పోలీసులే నేరుగా వెళ్లి 80 మందితో అంత్యక్రియలు నిర్వహించారంటేనే ఈ మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. 

- 'సిట్' దర్యాప్తు అంతా చంద్రబాబు మార్క్ డ్రామా.
: మనోహర్ రెడ్డి, వైయస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు.

కర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్ కేసులో పోలీసులను, నిందితులను రక్షించేందుకే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైకోర్టు ఆదేశాలతో వేసిన 'సిట్' (SIT) బృందం చంద్రబాబు నాయుడి డైరెక్షన్‌లోనే అడుగులు వేస్తోంది. 
బాధితురాలినే తీవ్రంగా హింసించి హత్య చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును మూసివేసేందుకు దర్గప్ప అనే వ్యక్తిని సీన్ లోకి తెచ్చి కట్టుకథలు అల్లుతున్నారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసులు లైసెన్స్‌డ్ గుండాల్లా వ్యవహరిస్తున్నారు. ఈ లాకప్ డెత్ ఘటనతో పాటు కేసు పక్కదోవ పట్టిస్తున్న తీరుపై వెంటనే సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ  ద్వారా సమగ్ర విచారణ జరిపించాలి.

Back to Top