విద్యార్థినుల ప్రాణాలతో చెలగాటం వద్దు 

బాలికల బీసీ హాస్టల్‌ను వెంటనే సురక్షిత భవనానికి తరలించాలి 

 మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా డిమాండ్ 

కడప: కడపలోని బాలికల బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థినుల ప్రాణాలకు ముప్పుగా మారిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కలిసి వసతి గృహాన్ని పరిశీలించిన ఆయన, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జిల్లాలోనే బీసీ విద్యార్థినులు ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

వసతి గృహ భవనం పూర్తిగా పాడైపోయి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, పైకప్పు పెచ్చులూడి పడుతూ విద్యార్థినులు గాయపడుతున్నారని తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ప్రమాదం జరిగాక స్పందించడం కాకుండా ముందుగానే విద్యార్థినుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికల ప్రాణాలకు ముప్పుగా మారిన వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయించి సురక్షితమైన భవనానికి తరలించాలని అంజాద్ బాషా డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకుండా కాలయాపన చేస్తే విద్యార్థినులను బీసీ భవనానికి తరలించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దని, ముఖ్యంగా బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తక్షణ చర్యలు చేపట్టాలని అంజాద్ బాషాతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరారు.  

 

Back to Top