శ్రీకాకుళం: అంపోలు సబ్‌జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు శుక్రవారం ములాఖాత్‌లో కలిశారు. పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు కుంబా రవిబాబు అప్పలరాజుతో భేటీ అయి ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. అధికార బలంతో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇలాంటి కేసులు, అరెస్టులకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుటుంబానికి పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాడి న్యాయాన్ని సాధించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, రాజపు అప్పన్న, బగ్గు రామకృష్ణ, కేచ్ గుప్తా, కనపల శేఖర్‌రావు, నడుపూరు శ్రీరామమూర్తి, పాలిన శ్రీనివాస్, ఎర్ర చక్రవర్తి, కిల్లి అజయ్, కణితి నారాయణమూర్తి, చిన్ని జోగారావు, సతివాడ రామినాయుడు, కల్లేపల్లి లక్ష్మణరావు తదితర వైయస్ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.