డీఎస్సీ దగాపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టం

జూపూడి ప్ర‌భాక‌ర్ రావు

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్ రావు

నీట్‌పై కేంద్రం స్పందించింది.. డీఎస్సీపై కూటమి ఎందుకు నోరు విప్పదు?

అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా చేసిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా న్యాయ విచారణ జరపాలి

విద్యార్థులు, నిరుద్యోగుల కోసం 28న రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ప్రభుత్వం మెడలు వంచేదాకా ప్రజల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ఈనెల 28న విద్యార్థులు, యువతతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ప్రెస్‌మీట్‌లో జూపూడి ప్ర‌భాక‌ర్ రావు స్ప‌ష్టీక‌ర‌ణ

తాడేపల్లి: నీట్‌పై ప్ర‌ధాని స్పందిచ‌గా లేనిది, డీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌ల‌పై కూటమి ప్ర‌భుత్వం ఎందుకు నోరు విప్పడం లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీరాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్ రావు ప్ర‌శ్నించారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా అన్యాయం చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. డీఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివి, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్షల నిర్వ‌హ‌ణ‌, ఉద్యోగ నియామకాలపై జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఆధారాల‌తో స‌హా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు ప్ర‌భుత్వాన్ని నిల‌దీసినా ఎందుకు స్పందించడం లేద‌ని నిల‌దీశారు. తాము త‌ప్పు చేయ‌న‌ప్పుడు సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు వెనుకాడుతున్నార‌ని, ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సమాధానం చెప్పాల్సిందేన‌ని జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

నీట్‌పై కేంద్రం కదిలింది.. డీఎస్సీపై మీరెందుకు కదలరు?

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది. పార్లమెంట్‌లో చర్చ జరిగే పరిస్థితి వచ్చింది. విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వ‌హ‌ణ తీరు, ఉద్యోగ నియామక ప్ర‌క్రియ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు, ఎన్నో ప్రశ్నలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదు? నెలలుగా వైఎస్ జ‌గ‌న్ గారు నిలదీస్తున్నా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? నీట్‌పై కేంద్రం స్పందించిన తీరు చూసైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. డీఎస్సీలో అధిక మార్కులు సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తయిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు చేశారు? క్వాలిఫై కానివారికి ఉద్యోగాలు ఇచ్చారనే ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? నిజంగా అర్హత సాధించిన అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిపక్ష నాయకుడి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇన్ని అనుమానాలు తలెత్తుతున్నప్పుడు సీబీఐ విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి భయమెందుకు?

దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించండి

డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే సీబీఐ విచారణకు సిద్ధపడాలి. లేదంటే కనీసం న్యాయ విచారణ అయినా జరిపించాలి. నెలలుగా ఇదే విషయాన్ని అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన అంశంపై మౌనం వహించడం కాదు.. వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

జీవో 4, 47, జీవో 56 వెనుక ఏముంది?

ఉద్యోగ నియామకాలాల్లో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రతి నిరుద్యోగికి ఉంది. డీఎస్సీ ప్రక్రియకు సంబంధించిన జీవో 4, 47, నియామకాల ప్రక్రియ పూర్తయ్యే సమయంలో తీసుకొచ్చిన జీవో 56పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ప్రక్రియ ప్రారంభించేటప్పుడు ఒక నిబంధన, ముగిసే సమయంలో మరో నిబంధన ఎందుకు? ఈ జీవోలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి.

ప్రజలే వేదికగా వైఎస్ జ‌గ‌న్ పోరాటం

ప్రతిపక్షం అంటే అసెంబ్లీలో మాత్రమే మాట్లాడటం కాదు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా తీసుకొని వాటిపై పోరాడటమే నిజమైన ప్రతిపక్ష పాత్ర. వైఎస్ జ‌గ‌న్ గారు విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, దళితులు సహా ప్రతి వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అసెంబ్లీని వేదికగా చేసుకునే అవకాశం ఇవ్వకపోయినా ప్రజలనే వేదికగా చేసుకుని పోరాటం కొనసాగుతుంది.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, ఉద్యమించే విద్యార్థులను భయపెట్టడం ద్వారా ప్రజల గొంతును అణచివేయలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదు. ప్రభుత్వం దిగివచ్చి సమాధానం చెప్పేదాకా ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజాస్వామ్యవాదులు ఈ ప్రజా ఉద్యమానికి అండగా నిలవాలి.

28న విద్యార్థులు, యువతతో రాష్ట్రవ్యాప్త ఉద్యమం

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. విద్యార్థుల పక్షాన నిలిచిన వారిపై కేసులు పెట్టినా, సోషల్‌ మీడియా పోస్టులు చేసిన వారిని వేధించినా వెనక్కి తగ్గేది లేదు. విద్యార్థులు, నిరుద్యోగుల గొంతుకగా వైయ‌స్ఆర్‌సీపీనిలబడుతుందని జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు హెచ్చ‌రించారు.

Back to Top