తిరుపతి: కూటమి ప్రభుత్వ పాలనలో రాజకీయ కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తుల వద్ద కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 2004లో భూమన కరుణాకరరెడ్డి కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకుని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడం రాజకీయ కక్షసాధింపేనని నారాయణస్వామి పేర్కొన్నారు. పోలీసుల ద్వారా పరిపాలన చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. భూమన కరుణాకరరెడ్డి జీవితాంతం విలువలతో కూడిన పోరాటాలు చేసిన నాయకుడని, ఆస్తులను ధ్వంసం చేస్తే భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. స్వర్ణముఖి నదీగర్భంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఆక్రమణలు ఉంటే వాటిని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి కుటుంబ ఆస్తులపై జరిగిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పరిపాలనను గాలికొదిలేసి రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, ఆస్తుల విధ్వంసం మానేసి తిరుపతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైయస్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భయపెట్టలేరని స్పష్టం చేశారు. కూటమి నేతల భూ ఆక్రమణలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.