గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల చర్యలను తీవ్రంగా ఎండగట్టారు. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్రంలో ఎక్కడా సక్రమంగా నామినేషన్లు వేయని పరిస్థితి నెలకొందని అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకుండా, పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తూ ఏకపక్షంగా 'ఏకగ్రీవాలు' చేసుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఐపీఎస్ అధికారులతో పాటు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు సహా మొత్తం 54 మంది పోలీసు అధికారులను తాము గుర్తించామని, వీరిపై న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను, దౌర్జన్యాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, స్దానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. గుంటూరు మేయర్ పదవికి పోటీ చేస్తున్న శ్రీదేవిని, కార్పొరేటర్ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... అరాచకాలతో ఏకగ్రీవాలు చేసుకునే దుష్టసాంప్రదాయం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై పూర్తిగా అపహాస్యం చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, అరాచకాల ద్వారా బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకునే దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను ముందస్తుగా ఎటువంటి కారణం లేకుండా గృహనిర్బంధం చేయడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి నిదర్శనం. మాజీ మంత్రి విడదల రజినిని ఇళ్ల వద్దే అడ్డుకోవడమే కాకుండా, పోలీసులు నెట్టివేయడంతో ఆమె కిందపడిపోయిన ఘటన అత్యంత దుర్మార్గమైనది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు వంటి సీనియర్ నాయకులను బయటికి రానీయకుండా గృహనిర్బంధం చేశారు. అభ్యర్థులకు బీ-ఫారాలు అందించకుండా, నామినేషన్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు హక్కులు లేకుండా చేసి, పోలీసుల అండతో సాగిస్తున్న ఈ దౌర్జన్యకాండను ప్రజలు గమనిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు: నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో పాటు జనసేన, బీజేపీ నాయకులపై కూడా టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. జనసేన నాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ కుటుంబంపై, కడపలో బీజేపీ అభ్యర్థి సురేష్‌పై జరిగిన దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. నామినేషన్ కేంద్రాల్లోకి మీడియాను అనుమతించకుండా, వాస్తవాలు బయటకు రాకుండా అధికార పార్టీ కుట్రలు పన్నుతోంది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు మారకపోవడం దారుణమైన పరిస్థితికి అద్దం పడుతోంది. రక్షణ కల్పిస్తామని ఫోన్లలో చెప్పే పోలీసులు, క్షేత్రస్థాయిలో మాత్రం అభ్యర్థులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు. నామినేషన్ పత్రాలను చించివేయడం, మహిళా అభ్యర్థుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు పరాకాష్ట. చంద్రబాబు, లోకేష్‌ల రాజకీయ స్వార్థం కోసం పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు. చట్టాల ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తాం: చట్టాన్ని ఉల్లంఘిస్తూ అరాచకాలకు పాల్పడుతున్న ఐపీఎస్ అధికారులతో సహా మొత్తం 54 మంది పోలీసుల వివరాలను మేము సేకరించాం. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు సహా తప్పు చేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారిపై న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారి, నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో పూర్తిగా విఫలమైంది. న్యాయ వ్యవస్థే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం. ఇలాంటి దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో సాధించే గెలుపును ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని అధికార పార్టీ గుర్తుంచుకోవాలి. ఈ రాక్షస పాలనకు, పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గుంటూరు మేయర్ స్థానంతో పాటు అన్ని చోట్లా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. ప్రజల ఓటు హక్కు ద్వారానే ఈ అధికార దుర్వినియోగానికి, అరాచక పద్ధతులకు సరైన గుణపాఠం చెప్పాలని అంబటి రాంబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.