‘తల్లికి వందనం’ కాదు.. తల్లుల వంచన పథకం

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి 
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

పథకంలో ఏకంగా 22.65 లక్షల మందికి కోత

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆక్షేపణ

పథకంలో కోతపై ముందే వ్యూహం

అందుకే తక్కువ బడ్జెట్‌ కేటాయింపు

నాడు నిబంధనలపై పిచ్చి విమర్శలు

ఇప్పుడు అవే మరింత కఠినంగా అమలు

ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణగోపాలకృష్ణ ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ కాస్త తల్లుల వంచన పథకంగా మారిందని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. పథకంలో ఏకంగా 22.65 మందికి కోత విధించడం అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చాక, మొక్కుబడిగా పథకం అమలు చేస్తూ, పిల్లలు, వారి తల్లులను దారుణంగా దగా చేస్తోందని ధ్వజమెత్తారు. పేదరికంతో ఏ పిల్లాడు బడికి వెళ్లకుండా ఉండొద్దన్న గొప్ప ఆశయంతో గత ప్రభుత్వంలో జగన్‌ గారు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించగా, పేరు మార్చిన టీడీపీ కూటమి, అడ్డగోలుగా కోత విధిస్తూ పథకం లక్ష్యాలను నీరు గార్చిందని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు. ఇంకా నిస్సిగ్గుగా ఈ పథకం తన కొడుకు ఆలోచన అని సీఎం చంద్రబాబు చెబుతున్నారని చురకలంటించారు. వాస్తవంగా పథకం అమలు, ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో ఎక్కడా సంబంధం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:

- పథకం అమలులో చిత్తశుద్ధి లేదు:

    యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 87.41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మంది మాత్రమే అర్హులని ప్రకటించడం ద్వారా 22.65 లక్షల మంది విద్యార్థులను పథకం నుంచి బయటకు నెట్టింది. ఇది చంద్రబాబు చేసిన దగా తప్పితే, విద్యార్థులు చేసిన తప్పు ఏమిటి? విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పన్నులు చెల్లిస్తున్న పౌరులేనని, వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం ఎందుకు విస్మరించింది. 
    ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున చెల్లించాలంటే సుమారు రూ.13,112 కోట్లకు పైగా అవసరం, అయితే ప్రభుత్వం కేటాయించిన నిధులు దానికి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ముందుగానే తక్కువ బడ్జెట్‌ కేటాయించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి పథకాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థుల తల్లులను వంచనకు గురి చేసే వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేసింది. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యకు అనుగుణంగా చెల్లింపులు జరగలేదు. చాలా మంది తల్లుల ఖాతాల్లో పూర్తి రూ.15 వేలకు బదులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు మాత్రమే జమ అయ్యాయి.

- పథకంలో రూ.22,840 కోట్లు బాకీ:

    మూడేళ్లు పథకాన్ని పక్కాగా అమలు చేసి ఉంటే సుమారు రూ.39,338 కోట్లు ఇవ్వాల్సి వచ్చేది. కానీ రెండేళ్లలో పథకంలో కోతలు విధించి, తక్కువ ఇవ్వడం వల్ల ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో ఏకంగా రూ.22,840 కోట్లు బాకీ పడింది. నిబంధనలు, అర్హత పేరుతో అడ్డగోలుగా కోత విధించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం, విద్యుత్‌ వినియోగం, వాహనాల యాజమాన్యం వంటి అంశాలతో పాటు, ఒకే కుటుంబంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ వంటి కోర్సుల విద్యార్థులు ఉంటే కూడా ఇతర పిల్లలకు పథకం వర్తింప చేయడం లేదు. నాడు పతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్‌ బిల్లు వంటి నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు అదే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తూ, ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు.

- ‘అమ్మఒడి’ దేశానికి ఆదర్శం:

    జగన్‌ గారు ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పేదరికం పిల్లల చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఆ పథకాన్ని అమలు చేశారు. ’నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదే. ఇంకా  ఇంగ్లీషు మీడియం, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, ఐబీ కరికులమ్, సీబీఎస్‌ఈ సిలబస్, పాఠశాలల్లో ఆర్‌వో ప్లాంట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలు వంటి సంస్కరణలను అమలు చేసి నాడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గుర్తు చేశారు.

Back to Top