ఎన్టీఆర్ జిల్లా: నందిగామ నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు మండిపడ్డారు. ముప్పాళ్లకు చెందిన వైయస్ఆర్‌సీపీ నేత రావూరి చిన్నాపై జరిగిన హత్యాయత్నం ఘటనను ఏసీపీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రావూరి చిన్నా, మద్దిపట్ల సాంబశివరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ముప్పాళ్ల–తుర్లపాడు గ్రామాల మధ్య కొందరు కాపుకాసి ట్రాక్టర్‌ను అడ్డుపెట్టి, కళ్లలో స్ప్రే కొట్టి మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారని జగన్‌మోహన్‌రావు తెలిపారు. దాడిలో చిన్నా స్పృహ కోల్పోగా, సాంబశివరావు కాలు విరిగిందన్నారు. అనంతరం స్థానికులు వారిని గుర్తించి నందిగామ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రావూరి చిన్నాపై గతంలోనూ దాడి జరిగిందని, కొన్నేళ్లుగా ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తాజా ఘటనలో నల్లాని కిషోర్, నల్లాని వాసు, నల్లాని పిచ్చయ్య, కమ్మ గోపీచంద్‌తో పాటు దాడికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులను సహించేది లేదని జగన్‌మోహన్‌రావు స్పష్టం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వైయస్ఆర్‌సీపీ తరఫున పోరాటం చేపడతామని హెచ్చరించారు.