తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీస్తోందని, బీసీ సంక్షేమంపై కూటమి ప్రభుత్వం, వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సంసిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం ఎలా దెబ్బతీస్తోందో వివరించేందుకు మేం సమావేశం ఏర్పాటు చేస్తుంటే, టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఏ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎక్కువ మేలు జరిగిందో టీవీ లైవ్ చర్చా వేదికల్లో మాట్లాడేందుకు సిద్ధమని, స్థలం, సమయం టీడీపీ నేతలే చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్సార్సీపీ బీసీ నాయకులు సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, నాగార్జున యాదవ్ లపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకివ్వలేదు? రాష్ట్రంలో బీసీల ప్రయోజనాలను ఈ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీస్తోందో వివరిస్తూ మేము సమావేశం ఏర్పాటు చేస్తే, టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. ఏ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎక్కువ మేలు జరిగిందో టీవీ లైవ్ చర్చా వేదికల్లో మాట్లాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ స్థలం, సమయం టీడీపీ నేతలే ఖరారు చేసి చెప్పాలి. రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు కేటాయించలేదు? వైఎస్సార్‌సీపీ హయాంలో మేము 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒకే రోజు డీబీటీ ద్వారా నిధులు సమకూర్చాం. మరి నేడు కూటమి ప్రభుత్వం కేవలం 40 కార్పొరేషన్లు మాత్రమే ప్రకటించి, మిగిలిన 16 కార్పొరేషన్లను ఎందుకు పక్కన పెట్టిందో జవాబు చెప్పాలి. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు బీసీ, పేద విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొస్తే, నేడు ఈ ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బకాయిలు పెట్టి బీసీలను ఉన్నత విద్యకు పూర్తిగా దూరం చేస్తోంది. ప్రశ్నిస్తున్నారనే ప్రభుత్వం బీసీ నాయకులను వేధిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2.5 లక్షల మంది వాలంటీర్లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 3.5 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. నిరుద్యోగ భృతి కింద ఈ రెండేళ్లలో ఒక్కో యువకుడికి ఇవ్వాల్సిన రూ. 72,000 బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైంది, సాగునీరు అందక రైతులు అల్లాడుతున్నారు. రైతులు కొనుగోలు చేసే యూరియా కోసం యాప్‌లు పెట్టి వేధిస్తున్న ఈ ప్రభుత్వం, లిక్కర్‌ను మాత్రం ఇంటింటికీ సరఫరా చేస్తూ పేదల రక్తాన్ని పిండుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, నాగార్జున యాదవ్ వంటి బీసీ నేతలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. బీసీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి నోళ్ళు మూయించడమేనా ప్రజాస్వామ్యం? మేము చేసిన ప్రతి ఆరోపణకూ ఆధారాలు ఉన్నాయి. బీసీల హక్కుల సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. నారా లోకేష్ రాజీనామా చేయాలి జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మరి ఇక్కడ రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో భారీగా అక్రమాలు, స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం జరిగినప్పుడు, దానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే ఎందుకు రాజీనామా చేయకూడదు? డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే ధైర్యం లేదని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.