నంద్యాల: రాజకీయ కక్షలతోనే శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదలకు మంచి చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సింది పోయి అడ్డుకోవడం సరికాదన్నారు. శిల్పా సేవా సమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 122 మంది మహిళా లబ్ధిదారులకు రూ.22.10 లక్షల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శిథిలావస్థలో ఉన్న దుకాణాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకుని, సుమారు **రూ.కోటి సొంత నిధులతో మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేశామని తెలిపారు. అక్కడ నిర్వహిస్తున్న శిల్పా సహకార సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంక్, నంది రైతు సహకార్ సేవా కార్యక్రమాలను దురుద్దేశంతో అడ్డుకుని షాపులను ఖాళీ చేయించారని ఆరోపించారు. పేదలపైనే భారం పడుతోంది దశాబ్దాలుగా నంద్యాలలో పేదలకు సేవలు అందిస్తున్న శిల్పా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల అంతిమంగా పేద ప్రజలే నష్టపోతున్నారని పేర్కొన్నారు. శిల్పా సహకార సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులను తొలగించి, ఇప్పుడు వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పేదలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. శిల్పా సేవా సమితి నిర్వహణలో ఉన్నప్పుడు రూ.5 వేలకే అద్దెకు అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం రూ.1.50 లక్షలు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రైతుల స్థలం పార్టీ కార్యాలయానికి ఎలా ఇస్తారు? నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు చెందిన విలువైన రెండు ఎకరాల స్థలాన్ని నెలకు ఎకరాకు కేవలం రూ.83 చొప్పున 33 సంవత్సరాల పాటు జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని శిల్పా రవి తప్పుపట్టారు. రైతుల అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలాన్ని పార్టీ ప్రయోజనాల కోసం కేటాయించడం సమంజసం కాదన్నారు. ఖాళీ చేయించిన శిల్పా మహిళా సహకార బ్యాంక్‌ను త్వరలో పద్మావతి నగర్‌లో నూతనంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. చేతనైతే మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజలకు సేవ చేస్తున్న వారిని అడ్డుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ మేనేజర్ హరిలీల, మహిళా ఖాతాదారులు, శిల్పా సేవా సమితి సిబ్బంది పాల్గొన్నారు.