ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ తప్పుకోవాలి

నీట్ ను మించిపోయిన డీఎస్సీ అక్రమాలు

లోకేష్ రాజీనామా చేసే వరకూ వదిలిపెట్టబోం

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల హెచ్చరిక

తాడేపల్లి: జాతీయ స్ధాయిలో నీట్ పరీక్ష అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తరహాలోనే ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందేనని రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తున్నా లోకేష్ కు చీమ కుట్టినట్లు అయినా లేదని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అయినా లోకేష్ కళ్లు తెరవాలని, లేకపోతే ఆయనతో రాజీనామా చేయించే వరకూ వదిలిపెట్టబోమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు హెచ్చరించారు. 

డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా ఎప్పుడు ?: అంబటి రాంబాబు, మాజీ మంత్రి 

నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు ? నీట్ తరహాలోనే డీఎస్సీలో అక్రమాలు సైతం ఘోరంగా జరిగాయి. ఉపాధ్యాయులు కావాలని విద్యార్ధులు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే లోకేష్ తన అనుచరులకు పోస్టులు ఇచ్చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరీక్ష రాస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలా ఎలా వస్తుంది ? అతనికి హాల్ టికెట్ ఇవ్వకుండా మభ్యపెట్టి పక్కకు నెట్టేస్తే అతను హైకోర్టుకు వెళ్లాడు. డేటా లీకేజ్ కూడా చేశారు. స్పోర్ట్స్ కోటాలో కనీవినీ ఎరుగని దారుణం జరిగింది. సాధారణంగా స్పోర్ట్స్ కోటా విషయంలో పరీక్షలు పెట్టాక సర్టిఫికెట్ల ప్రకారం కొన్ని మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారు. పాత జీవో రద్దు చేసి మరో జీవో తెచ్చారు. లోకేష్ కు సన్నిహితంగా ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాక తిరిగి ఒరిజినల్ జీవో తెచ్చారు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే. 

పానుగంటి చైతన్య, పార్టీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు

నీట్ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్నారు. మరి ఏపీలో డీఎస్సీ అక్రమాలకు లోకేష్ ఎప్పుడు బాధ్యత వహించి తప్పుకుంటారో చెప్పాలి. డీఎస్సీలో నోటిఫికేషన్ నుంచి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చే వరకూ అన్నీ అక్రమాలే. డీఎస్సీ, టెట్ లకు ఒకే కన్వీనర్ పెట్టడం, స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోవడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకపోవడం ఇలా అన్నీ అక్రమాలే జరిగాయి. కాబట్టి అక్రమాలపై సీబీఐ విచారణతో పాటు నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇవే డిమాండ్లతో 28న అన్ని జిల్లా కేంద్రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నిరసనలు చేపట్టబోతోంది. 

మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే

నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పుల పై విద్యార్ధుల ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.  ఇక్కడ డీఎస్సీ అక్రమాలను ఆధారాలతో సహా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. 
అధికారంలో ఉన్నవారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు వస్తాయో ఈరోజు చూశాం.  కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలి.  నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం. 

జోగారావు, మాజీ ఎమ్మెల్యే

నీట్ పరీక్ష అక్రమాలపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇక్కడ డీఎస్సీ అక్రమాలపైనా లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏళ్ల తరబడి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అక్రమ జీవోలు, బేరసారాలు, లోకేష్ కుతంత్రాల ద్వారా అన్యాయం చేశారు. కాబట్టి డీఎస్సీ అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేయాలని మేం ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆదర్శంగా తీసుకుని లోకేష్ కూడా రాజీనామా చేయాలి. 

కేకే రాజు, విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు

జాతీయ స్దాయిలో నీట్ పరీక్ష అక్రమాలు ఎంత తీవ్రమైనవో, ఏపీలో డీఎస్సీ అక్రమాలు అంతకంటే తీవ్రమైనవి. నీట్ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి దిగొచ్చి కేంద్రమంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాబట్టి ఏపీలో డీఎస్సీ దగా, మెరిట్ లిస్ట్ అక్రమాలు, బేరసారాలకు బాధ్యత వహించి ఏపీ విద్యామంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలి. డీఎస్సీ అక్రమాలపై తప్పుడు జరిగాయని అందరూ నిర్ధారించారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందే.

వడ్డి రఘురాం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ 

నీట్ అక్రమాలపై విద్యార్ధుల ఆందోళనలకు తలొగ్గి బీజేపీలో కీలకంగా ఉన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక్కడ డీఎస్సీలో ఎన్నో అక్రమాలు జరిగినా కనీసం సీబీఐ దర్యాప్తు కూడా చేయకుండా, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయకుండా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కేంద్ర మంత్రి తరహాలోనే రాష్ట్రమంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి. డీఎస్సీ మీద తక్షణం సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే విద్యార్ధులకు నమ్మకం కలుగుతుంది. 

కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అధికార ప్రతినిధి

నీట్ పరీక్ష అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతగా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారో చెప్పాలి. నీట్ తరహాలోనే డీఎస్సీ అక్రమాలు కూడా లక్షలాది మంది నిరుద్యోగులతో ముడిపడిన అంశం. ఇప్పటికే ఇక్కడ యువత రోడ్లెక్కారు. అయినా కూటమి ప్రభుత్వం కానీ, లోకేష్ కానీ నోరు విప్పిన పాపాన పోలేదు. మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు చెప్పుకునే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ తో రాజీనామా చేయించాలి.

Back to Top