కూటమి ప్రభుత్వంలో  'మిధ్యాశాఖ'గా మారిన విద్యాశాఖ. 

పేపర్ లీకేజీలు, అబద్ధాల పాలనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ డిమాండ్. 

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్.

తాడేపల్లి : కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ 'మిధ్యాశాఖ'గా మారిపోయిందని వైయ‌స్ఆర్‌సీపీ నేత నాగార్జున యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ... 
మెగా పిటిఎం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలు, డిఎస్సీ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఆయనను క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. 

- కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం. 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యుడిఐఎస్ఈ (UDISE) గణాంకాలే చంద్రబాబు పచ్చి అబద్ధాలను బట్టబయలు చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో  పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తే, ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థ ను పూర్తిగా నిర్వీర్యం చేసింది. 

-  చంద్రబాబు అబద్ధాలు – UDISE రిపోర్ట్ నిజాలు. 

 మెగా పిటిఎం వేదికగా ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లోకి 1.10 లక్షల మంది విద్యార్థులు వచ్చారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ యుడిఐఎస్ఈ (UDISE) నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల నుంచి 5,56,666 మంది విద్యార్థులు బయటకు వెళ్ళిపోయారు. అంటే ఏకంగా 13 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది.
 
- కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తూ ప్రైవేట్ అడ్మిషన్ల పెంపు.

వైయస్. జగన్ పాలనలో చివరి విద్యా సంవత్సరంలో ప్రైవేట్ బడుల్లో 45,53,380 మంది ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 48,40,296కు పెరిగింది. అంటే ప్రైవేట్ పాఠశాలల్లో 63% (2,86,916 మంది) విద్యార్థులు పెరిగారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ స్కూళ్లకు వత్తాసు పలకడమే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండా.
 
- తల్లికి వందనం' కాస్త 'తల్లికి సందేహం'గా మారింది. 

 ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ. 15,000 ఇస్తామని మాటిచ్చి, ఇప్పుడు దానికి దిక్కులేకుండా చేశారు. రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులకు రూ. 13,112 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ. 6,377 కోట్లు మాత్రమే విడుదల చేసి అరకొర నిధులతో మభ్యపెడుతున్నారు. మొదటి ఏడాది అసలు రూపాయి కూడా ఇవ్వకుండా తల్లిదండ్రులను మోసం చేశారు.

- నాడు-నేడు ఆస్తులపై కూటమి రంగులు.

ఈ రోజు మెగా పిటిఎమ్‌లో ప్రదర్శిస్తున్న ఐఎఫ్ పి (IFP) ప్యానెళ్లు, విద్యార్థులు కూర్చున్న బెంచీలు, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్లు.. ప్రతీ ఒక్కటీ వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేసినవే. వైయస్. జగన్ మోహన్  'గేమ్ చేంజర్' అయితే, చంద్రబాబు కేవలం పేరు మార్చే 'నేమ్ చేంజర్'గా మిగిలిపోయారు.
 
- డిఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.

నీట్ (NEET) పేపర్ లీకేజ్ అంశంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో డిఎస్సీ పేపర్ లీక్ చేసి, స్పోర్ట్స్ కోటా పేరిట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు టీచర్ పోస్టులు అమ్ముకున్నందుకు నారా లోకేష్ ఎందుకు రాజీనామా చేయరు? చంద్రబాబుకు ఏమాత్రం నైతికత ఉన్నా లోకేష్‌ను విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి.

- ఈ నెల 28న కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు. 

కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు  నిర్వహిస్తాం. 87 లక్షల మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' నిధులు పూర్తిగా జమ చేయడంతో పాటు నాడు-నేడును తిరిగి కొనసాగించే వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోరాటం ఆగదని నాగార్జున యాదవ్ స్పష్టం చేశారు.

Back to Top