విజయవాడలో గుర్రం జాషువా 55వ వర్ధంతి

జాషువా విగ్రహానికి నివాళులర్పించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

విజయవాడ: నవయుగ కవి చక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలపై తన రచనలతో పోరాటం సాగించిన గొప్ప కవి జాషువా అని నేతలు కొనియాడారు. అణగారిన వర్గాల ఆవేదనకు తన కవిత్వంతో గొంతుకగా నిలిచి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం జీవితాంతం అక్షర పోరాటం సాగించారని గుర్తుచేశారు. జాషువా రచనలు నేటికీ సామాజిక చైతన్యానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. జాషువా ఆశయాలను నేటి తరాలకు అందించడంతో పాటు ఆయన ఆకాంక్షించిన సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడు కాలే పుల్లారావుతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 

Back to Top