తాడేపల్లి: ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని, వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన క్రెడిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైయస్ జగన్ తప్పుపట్టారు. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా శంకుస్థాపన చేయడం మినహా చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు చేసిన కృషి ఏమిటని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా వైయస్ జగన్.. ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. చంద్రబాబు గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ? అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం. కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్‌పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి. సంబంధిత ఆధారాలు- tinyurl.com/rv5udede https://x.com/ysjagan/status/2082334339040522387?s=20 #CreditChorBabu