డీఎస్సీ నిరసనలపై పోలీసు ఆంక్షలు

దెందులూరులో అబ్బయ్య చౌదరిని అడ్డుకున్న పోలీసులు

తిరుపతిలో సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఇరగం అనిల్ రెడ్డి అరెస్టు

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల సందర్భంగా పలుచోట్ల పార్టీ నాయకులపై పోలీసులు ఆంక్షలు విధించడం, అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దెందులూరు, తిరుపతిలో జరిగిన ఘటనలపై పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అశోక్ నగర్‌లోని పార్టీ కార్యాలయం వద్దే అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. శాంతియుతంగా నిరసనలో పాల్గొనే అవకాశాన్ని కూడా నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఇరగం అనిల్ రెడ్డిని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఉదయం నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మెగా డీఎస్సీ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్న ఆయనను, జె.బి. శ్రీనివాస్ ఇంటిపై దాడి కేసుతో సంబంధం ఉందనే కారణంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

డీఎస్సీ బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన ఆందోళనలను పోలీసు బలంతో అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పార్టీ నాయకులు పేర్కొన్నారు. నిరసనలను అడ్డుకోవడం, నాయకులను అదుపులోకి తీసుకోవడం ద్వారా ప్రజల గొంతును నొక్కివేయలేరని, బాధిత అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 

Back to Top