సింహాచలం అప్పన్న భూములను డేటా సెంటర్‌కు ఇవ్వడం మహాపచారం 

విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు 

 విశాఖపట్నం: సింహాచలం గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని విశాఖప‌ట్నం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ప్రచార ఆర్భాటం తప్ప భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదని, గిరిప్రదక్షిణలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ప్రత్యక్షంగా నరకం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిరిప్రదక్షిణకు ఎంతమంది భక్తులు వస్తారనే కనీస అంచనా కూడా అధికారులకు లేకపోయిందని అన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారని, కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోయారని విమర్శించారు. భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంప్రదాయానికి విరుద్ధంగా ఎక్కడబడితే అక్కడ తొలి పావంచాలు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తొలి పావంచాల అంశంపై హోంమంత్రి ప్రకటన చేయడం ఏమిటని నిలదీశారు. ఇలాంటి చర్యలతో భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. ఇంతటి కీలకమైన సమయంలో దేవాదాయ శాఖ మంత్రి, సింహాచలం ట్రస్ట్‌ చైర్మన్ ఎక్కడా కనిపించలేదని ప్రశ్నించారు.

సింహాచలం అప్పన్నకు చెందిన భూములను డేటా సెంటర్‌కు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు మహాపచారానికి పాల్పడ్డారని కేకే రాజు మండిపడ్డారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలు, దేవుడి ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
 

Back to Top