మాల గంగమ్మ లాకప్‌డెత్‌ను కప్పిపుచ్చేదెవరు?

వైయ‌స్ఆర్‌సీపీ నేతల మండిపాటు

కర్నూలు జిల్లా కౌతాళం మండలం బద్దెనహల్ గ్రామంలో పర్యటించిన వైయ‌స్సార్‌సీపీ నిజనిర్దారణ కమిటి. అనంత‌రం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శైలజానాథ్ , ఎమ్మెల్సీ మధుసూదన్ , వైయ‌స్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి , జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు వెంక‌టేష్‌.

బద్దెనహల్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన

కమిటీ వచ్చే సరికి కుటుంబ సభ్యుల ఇళ్లకు తాళాలు

ఎవరి ఒత్తిడితో గంగమ్మ కుటుంబ సభ్యులు పక్కకు వెళ్లిపోయారు?

గంగమ్మ మృతిపై మరిన్ని అనుమానాలు.. సత్యాన్ని ఎంతోకాలం దాచలేరు

సిట్‌ విచారణ నుంచి గంగమ్మ మృతి వరకు జరిగిన పరిణామాలన్నీ నిగ్గుతేలాలి

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

క‌ర్నూలు: మాల గంగమ్మ లాక‌ప్ డెత్‌ వెనుక అసలు ఏం జరిగింది..? నిజాలను ఎవరు కప్పిపుచ్చుతున్నారు..? బాధిత కుటుంబ సభ్యులు ఎందుకు అందుబాటులో లేకుండా పోయారు..? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. గంగమ్మ మృతిపై రోజురోజుకూ అనుమానాలు బలపడుతున్నాయని, సత్యాన్ని ఎంతగా దాచిపెట్టాలని ప్రయత్నించినా బయటకు రాకుండా ఆపలేరని స్పష్టం చేశారు. ఈ ఘటనలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ కర్నూలు జిల్లా కౌతాళం మండలం బద్దెనహల్‌ గ్రామంలో పర్యటించింది. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లగా ఇళ్లకు తాళాలు వేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. గంగమ్మ మృతికి ముందు, తర్వాత జరిగిన ప్రతి పరిణామాన్ని వెలికితీసి బాధ్యులెవరో తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. అనంతరం మాజీ మంత్రి డాక్టర్‌ సాకె శైలజానాథ్‌, ఎమ్మెల్సీ మధుసూదన్‌, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటేష్‌ మీడియాతో మాట్లాడారు.

మీడియా సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే..

- సత్యాన్ని ఎంతోకాలం దాచిపెట్టలేరు: డాక్టర్‌ సాకె శైలజానాథ్‌, మాజీ మంత్రి

బద్దెనహల్‌లో అసలు ఏం జరిగింది? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకే వైయ‌స్ఆర్‌సీపీ తరఫున నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతి వ్యక్తికీ జీవించే హక్కును కల్పించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఘటనపై మాకు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. గంగమ్మ కుటుంబ సభ్యులు ఉదయం వరకు గ్రామంలోనే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. మేము వచ్చే సమయానికి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. సత్యాన్ని ఎంతోకాలం దాచిపెట్టగలమని ఎవరైనా అనుకుంటే అది భ్రమ మాత్రమే. నిజం తప్పకుండా బయటకు వస్తుంది.

ఈ ఘటనపై గ్రామంలో బహిరంగంగా మాట్లాడేందుకు కూడా కొందరు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గంగమ్మ మృతి విషయంలో అసలు ఏం జరిగిందన్నది బయటకు రావాలి. ఒక కుటుంబం మొత్తం ఛిద్రమైంది. తల్లి మరణించింది. కుమారుడి ఆచూకీపై ప్రశ్నలు ఉన్నాయి. ఇంతటి ఘటన చుట్టూ అనుమానాలు కొనసాగడం సమాజానికి మంచిది కాదు. ఏ స్థాయిలో నిజం దాగి ఉన్నా దాన్ని బయటకు తీసుకురావాలి. పోలీసు శాఖతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అవకాశం లేకపోతే మరోసారి వచ్చి వివరాలు తెలుసుకుంటాం. ప్రాణానికి అత్యున్నత విలువ ఉంది. మరణించిన వ్యక్తికీ రాజ్యాంగపరంగా గౌరవం ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నిజాన్ని నమ్ముతుంది. ఈ ఘటనలోనూ నిజం బయటకు వచ్చే వరకు ప్రయత్నిస్తాం.

- కుటుంబ సభ్యుల ఇళ్లకు తాళాలు.. అనుమానాలకు తావిస్తోంది: మధుసూదన్‌, ఎమ్మెల్సీ

గంగమ్మ మృతి ఘటనలో వాస్తవాలను తెలుసుకునేందుకే నిజనిర్ధారణ కమిటీగా బద్దెనహల్‌కు వచ్చాం. మాజీ మంత్రి శైలజానాథ్‌, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నేతలు, ఇతర సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నాం. గంగమ్మ కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రయత్నించాం. ఆమె అత్తగారిని కలిశాం. కుమారుడి ఇంటికి వెళ్లగా తాళాలు వేసి ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు కారణమవుతోంది. గంగమ్మ మృతి విషయంలో వాస్తవంగా ఏం జరిగిందో సమగ్రంగా బయటకు రావాలి.

- గంగమ్మ మృతి వెనుక సమాధానం లేని ప్రశ్నలెన్నో: మనోహర్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

మాల గంగమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఏం జరిగింది? ఘటనకు ముందు, తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీగా వచ్చాం. కానీ ఆమె అత్తగారు మినహా మిగిలిన కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

తన కుమారుడు కనిపించడం లేదని గంగమ్మ పోలీసులను ఆశ్రయించారని, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారని తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆ దర్యాప్తు క్రమంలో గంగమ్మకు ఏం జరిగింది? ఆమె మృతికి దారితీసిన పరిస్థితులేమిటి? అనే అంశాలపై పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది.

గంగమ్మను విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని, ఆ తర్వాత ఆమె మృతి చెందిందనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బెదిరించి మరో విధంగా చెప్పించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వీటిలో నిజానిజాలేమిటో తేలాల్సిందే. అందుకే బాధిత కుటుంబం, గ్రామస్థులతో పాటు పోలీసులతోనూ మాట్లాడతాం. అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి మరిన్ని వివరాలు సేకరిస్తాం. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందన్న వాస్తవాలను సమాజానికి తెలియజేసే బాధ్యతను నిజనిర్ధారణ కమిటీ తీసుకుంటుంది.

- గంగమ్మ కుటుంబానికి న్యాయం జరగాలి: వెంకటేష్‌, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

మాల గంగమ్మకు జరిగిన ఘటన అత్యంత విచారకరం. ఆమె మృతికి ముందు జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. సిట్‌ విచారణ సందర్భంగా ఆమెను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై నిజానిజాలు బయటకు రావాలి.

గంగమ్మ మృతి విషయంలో ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టకుండా నిజనిర్ధారణ కమిటీ పరిశీలించాలి. బాధ్యులు ఎవరైనా వాస్తవాలు బయటకు రావాలి. గంగమ్మ కుటుంబానికి న్యాయం జరగాలి. దళితులపై జరుగుతున్న ఘటనలను తీవ్రంగా పరిగణించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గంగమ్మ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుంది.

Back to Top