తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లుగా దళితుల నరమేధం జరుగుతోందని, మళ్లీ వైఎస్ జగన్ గారు సీఎం అయితేనే దళితులకు స్వేచ్ఛ లభిస్తుందని వైయస్ఆర్‌సీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా దళితులు ఇప్పటికీ కులవివక్షతకు గురవుతున్నారని, కూటమి పాలనలో అన్ని రంగాల్లో అణచివేత కొనసాగుతోందని అసహనం వ్యక్తం చేశారు. దళితులపై ఈ ప్రభుత్వం కక్షపెంచుకుందని, బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగంతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాషువా రచనల స్ఫూర్తితో, అంబేడ్కర్ పోరాట పటిమతో దళితులంతా ఐక్యంగా ఉద్యమించి మళ్లీ వైఎస్ జగన్ గారిని సీఎంగా చేసుకుంటామని నినదించారు. జగన్ గారు సీఎం అయితేనే దళితులకు న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి వేల్పుల రవి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే... ఈ ప్రభుత్వం పడిపోయినప్పుడే ఎస్సీలకు స్వేచ్ఛ - టీజేఆర్ సుధాకర్ బాబు, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మా వీపులు పగలగొట్టినా, సంఘ బహిష్కరణలు చేసినా, అంటరానితనాన్ని మా మీద రుద్దినా.. వైఎస్ జగన్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే మా అంకితభావం నుంచి పక్కకు తప్పించలేరు. గుర్రం జాషువా గారి సిద్ధాంతాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, 'జై భీమ్ - జై జగన్' నినాదాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం. వైఎస్ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే మా ఆత్మగౌరవం నిలబడుతుంది, మా బిడ్డలకు చదువు, ఇళ్లు, పథకాలు వస్తాయి. రాజ్యాధికారం రాకపోతే మన జాతులకు న్యాయం జరగదు. ఈ ప్రభుత్వం దిగిపోతే తప్పించి మనం బ్రతకలేము అనేది నగ్న సత్యం. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేదాకా విశ్రమించకుండా పనిచేద్దాం. జాషువా ఆలోచన విధానమే వైయస్ఆర్‌సీపీ విధానం - జూపూడి ప్రభాకర్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యను ఆయుధంగా తీసుకుంటే, గుర్రం జాషువా గారు తన పద్యం, కవిత ద్వారా సామాజిక రుగ్మతలను నిలదీశారు. అంటరానితనానికి నిరసనగా 'గబ్బిలం' ద్వారా దేవుని చెవిలో తన బాధను చెప్పుకునే విప్లవాత్మక మార్గాన్ని ఆయన చూపారు. ఆనాడు బడిలో కనీసం కూర్చోడానికి బెంచ్ లేదని జాషువా ఆవేదన చెందితే, వైఎస్ జగన్ గారు 'నాడు-నేడు' ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చి విద్యా విప్లవం తెచ్చారు. జాషువా గారి ఆలోచన విధానమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. అంబేద్కర్, జాషువా ఎత్తిచూపిన రుగ్మతలను పరిపాలన ద్వారా సరిదిద్దిన నాయకుడు వైఎస్ జగన్ గారు." కలాన్ని ఖడ్గంగా మార్చిన యోధుడు జాషువా - కొమ్మూరు కనకరావు, పార్టీ ఎస్సీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్టడుగు వర్గంలో పుట్టి, సామాజిక అణచివేతను అనుభవించి తన కలాన్నే ఖడ్గంగా మలచుకుని కుల నిర్మూలన కోసం పోరాడిన మహాకవి గుర్రం జాషువా. 'ఫిరదౌసి'లో రాజు కవిని మోసం చేసినట్లే, నేడు కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీల పేరుతో ప్రజలను మోసం చేసింది. చంద్రబాబు పాలనలో దళితులకు భద్రత లేకుండా పోయింది. 'నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ' అని అక్కున చేర్చుకుని నవరత్నాల ద్వారా పేదలకు పట్టంగట్టిన వైఎస్ జగన్ గారి పాలన మళ్లీ రావడం ద్వారానే జాషువా గారి ఆశయాలు నెరవేరుతాయి. దళితులు సామాజికంగా బలపడాలి - కాకుమాను రాజశేఖర్, పార్టీ ప్రచార విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దశాబ్దాలు గడుస్తున్నా సమాజంలో వివక్ష కొనసాగడం విచారకరం. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో చెప్తున్నాను.. బయట సమాజంలోనే కాదు, రాజకీయాల్లోనూ ఈ రుగ్మత ఉంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు ఈ వర్గాలను తమ కుటుంబంలో చేర్చుకోవడం వల్లే ఈరోజు మనం ధైర్యంగా నిలబడగలుగుతున్నాం. దళిత జాతులు ఐక్యంగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఉన్నత చదువులు చదివి, ఆర్థికంగా, సామాజికంగా బలపడినప్పుడే ఈ అంటరానితనాన్ని తరిమికొట్టగలము. సమాజంలో అందరూ సమానమే - నలమారు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను, 'అందరూ సమానమే' అనే భావనను జాషువా గారు తన రచనల ద్వారా సామాన్యులకు చేరవేశారు. మహాకవి ఆశయాలకు అనుగుణంగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న వైఎస్ జగన్ గారికి మనమందరం అండగా నిలవాలి. ఈ రాక్షస పాలనను ఎదిరించి, జగనన్న నాయకత్వంలో జాషువా గారి ఆశయ సాధనకు ముందుకు సాగుదాం. రాష్ట్రంలో దళితుల నరమేధం - నందిగం సురేష్, బాపట్ల మాజీ ఎంపీ ఆనాడు జాషువా గారిని, అంబేద్కర్ గారిని తొక్కాలని చూసిన వారు ఏమైపోయారో తెలియదు కానీ, ఆ మహానీయులు మాత్రం ప్రపంచ స్థాయికి ఎదిగారు. వైఎస్ జగన్ గారు కూడా అదే స్ఫూర్తితో అక్రమ కేసులు, అవమానాలను తట్టుకుని ప్రజల మనస్సుల్లో నిలిచారు. కూటమి ప్రభుత్వంలో దళితులు, బీసీలు, మైనార్టీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో నరమేధం జరుగుతుంటే దళిత హోం మంత్రి పరామర్శకు కూడా వెళ్లలేని దయనీయ స్థితి ఉంది. మనమందరం ఐక్యంగా ఉండి, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది - సురేంద్ర, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు కులం కాదు.. మనిషి గుణమే ఉన్నత స్థానాన్ని నిర్ణయిస్తుందని జాషువా ఆనాడే చెప్పారు. సాంకేతికంగా ఎంతో ముందడుగు వేసినా, పాలించే నాయకుల్లో మాత్రం వర్ణ వివక్ష పోలేదు. 'ఎస్సీలుగా ఎవరైనా పుడతారా' అని మాట్లాడే చంద్రబాబు నాయుడి ఆలోచనా విధానానికి, అసెంబ్లీ సాక్షిగా దళిత, గిరిజనులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ గారి ఆలోచనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ కుల వివక్షకు అంతం లభిస్తుంది. జాషువా స్ఫూర్తిని నేటి తరాలకు అందించాలి - వేల్పుల రవి, పార్టీ అధికార ప్రతినిధి అంటరానితనంతో బాధపడి, అవమానాలు ఎదుర్కొని, ఆ కసితో అద్భుతమైన కవితల ద్వారా సమాజ వైరుధ్యాలను చీల్చి చెండాడిన ధైర్యశాలి గుర్రం జాషువా. 'గుణం లేని వాడు కులాన్ని, మానవత్వం లేని వాడు మతాన్ని మాట్లాడుతాడు' అని నిష్కర్షగా చెప్పారాయన. మేము అంబేద్కర్, జాషువా, వైఎస్సార్, జగనన్న వారసులమని గర్వంగా చెప్పుకుంటాం. జాషువా రాసిన గ్రంథాలను చదివి, ప్రస్తుత తరాలకు వివరిస్తూ, వివక్షపై పోరాటానికి అంకితమవుతాం. బహుజనులకు జాషువా, అంబేడ్కర్‌లు రెండు కళ్లు - ప్రేమలత, పార్టీ నాయకురాలు దళిత, బహుజన సమాజానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక కన్ను అయితే, గుర్రం జాషువా మరొక కన్ను లాంటివారు. అంటరానితనాన్ని తొలగించి, చదువు, ఓటు హక్కుల ప్రాముఖ్యతను తమ రచనల ద్వారా మనకు అందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కలిసికట్టుగా ఉండి, వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముందుకు సాగడమే ఆ మహానీయులకు మనం ఇచ్చే నిజమైన నివాళి.