నరసన్నపేట : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ, ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు పలాస బయలుదేరిన వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. అయినప్పటికీ పోలీసు ఆంక్షలను దాటుకుని ఆయన పలాస చేరుకుని అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురువారం ఉదయం సుమారు 30 వాహనాల కాన్వాయ్‌తో పలాస బయలుదేరిన కృష్ణదాస్‌ను నరసన్నపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రూట్ మార్చిన ఆయన చల్లపేట జంక్షన్, పాతపట్నం మీదుగా ఒడిశాలోని పర్లాకిమిడి చేరుకుని, అక్కడి నుంచి మెలియాపుట్టికి వెళ్లారు. సీదిరి అప్పలరాజు అరెస్టును నిరసిస్తూ పలాసలో నిరసన చేపట్టిన వైయస్సార్‌సీపీ నేత పేరాడ తిలక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మెలియాపుట్టి పోలీసు స్టేషన్‌కు తరలించడంతో కృష్ణదాస్ అక్కడికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అక్రమ అరెస్టులకు పార్టీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని ధైర్యం చెప్పారు. అనంతరం పలాసలోని సీదిరి అప్పలరాజు నివాసానికి చేరుకున్న కృష్ణదాస్ ఆయన భార్య శ్రీదేవి, కుమారుడిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అప్పలరాజు కుటుంబానికి వైయస్సార్‌సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార బలంతో పార్టీ శ్రేణులను భయపెట్టలేరని, అక్రమ కేసులు, అరెస్టులపై న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.