మా భూమిపై బుల్డోజర్లు.. హెరిటేజ్ ఆక్రమణలపై ఎందుకు మౌనం?

ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా?

భూమన అభినయ్‌రెడ్డి మండిపాటు

వైయ‌స్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి

కరుణాకర్‌రెడ్డి గొంతు నొక్కేందుకే కుటుంబ ఆస్తులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు

24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ఇప్పుడు రివర్‌బెడ్‌గా చిత్రీకరించడం రాజకీయ ప్రతీకారమే

కోర్టు ఆదేశించినా ఆధారాలు ఇవ్వలేదు.. ముందస్తు నోటీసు లేకుండానే కాంపౌండ్ వాల్ ధ్వంసం

మా భూమిలో కట్టడమే లేదు.. బఫర్ జోన్‌లో హెరిటేజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌పై చర్యలేవి?

మాపై చూపిన ఉత్సాహాన్ని హెరిటేజ్ విషయంలోనూ చూపించే ధైర్యం అధికారులకు ఉందా?

అధికారులను సూటిగా ప్రశ్నించిన అభినయ్‌రెడ్డి

మా ఆస్తులన్నీ ధ్వంసం చేసినా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ఆపేది లేదు

రెడ్‌బుక్ రాజ్యాంగం కాదు.. అందరికీ సమానంగా చట్టాన్ని అమలు చేయాలి

తేల్చి చెప్పిన భూమన అభినయ్‌రెడ్డి

తిరుపతి:  ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేందుకు వారి కుటుంబ ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని వైయ‌స్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తమ తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని రివర్‌బెడ్‌గా చిత్రీకరించి, కోర్టు ఆదేశాల మేరకు ఆధారాలు ఇవ్వకుండానే వందలాది మంది పోలీసులను మోహరించి కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేయడం ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. తమ భూమిపై బుల్డోజర్లతో విరుచుకుపడిన అధికార యంత్రాంగానికి, స్వర్ణముఖి నది బఫర్ జోన్‌లో హెరిటేజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందన్న తమ వాదనపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక చట్టం, ప్రతిపక్ష నేతల కుటుంబాలకు మరో చట్టమా అని నిలదీశారు. తమ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసినా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతును అణచలేరని స్పష్టం చేశారు. వైయ‌స్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ భూమన అభినయ్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రెస్‌మీట్‌లో భూమన అభినయ్‌రెడ్డి ఏమన్నారంటే..

- 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి

తిరుచానూరులో ఉన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని దాదాపు 24, 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశాం. అక్కడ ఎలాంటి భవనాలు, ఇతర నిర్మాణాలు లేవు. మామిడి చెట్లను సాగు చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం. ఆ భూమికి సంబంధించిన పత్రాలు మా వద్ద ఉన్నాయి. అయినప్పటికీ ఈ తొమ్మిది ఎకరాలు రివర్‌బెడ్‌కు సంబంధించిన సర్వే నంబర్‌లో ఉన్నాయని ప్రభుత్వం చిత్రీకరిస్తోంది.

- కోర్టు ఆదేశించినా ఆధారాలు ఎందుకు ఇవ్వలేదు?

ఈ భూమి రివర్‌బెడ్‌లో ఉందంటూ గతంలో నోటీసు ఇవ్వడంతో మేము కోర్టును ఆశ్రయించాం. ఈ తొమ్మిది ఎకరాలు రివర్‌బెడ్‌లోనే ఉన్నాయని చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి సర్వే వివరాలు, ఆధారాలు ఇవ్వాలని కోరాం. కోర్టు కూడా తగిన ఆధారాలతో వివరణ ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. కానీ మాకు ఎలాంటి వివరణగానీ, నివేదికగానీ ఇవ్వలేదు.

- నోటీసు లేకుండా కాంపౌండ్ వాల్ ధ్వంసం

కోర్టు ఆదేశాల ప్రకారం మాకు వివరణ ఇవ్వకుండానే, ముందస్తు నోటీసు కూడా లేకుండా అధికారులు మా ప్రైవేట్ ఆస్తిలోకి వచ్చారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, డీఎస్పీ, సీఐలు, వందలాది మంది పోలీసులతో వచ్చి మా కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసి, ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని మేము భావిస్తున్నాం.

- కరుణాకర్‌రెడ్డి గొంతు నొక్కాలన్నదే లక్ష్యం

భూమన కరుణాకర్‌రెడ్డి ప్రతిరోజూ ప్రభుత్వ తప్పులను, లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటే ఆయన గొంతు మూయించవచ్చనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారు. కానీ మీ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. మా ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసినా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు.

- హెరిటేజ్ విషయంలో ఇదే చట్టం వర్తించదా?

కాసేపు మా భూమిపై ప్రభుత్వం చేస్తున్న వాదనే నిజమని అనుకుందాం. ఇదే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కాశీపెంటల గ్రామంలో హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉంది. స్వర్ణముఖి నదికి సంబంధించిన సర్వే నంబర్ 185కు ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 173లో హెరిటేజ్‌కు సంబంధించిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందని మేము చెబుతున్నాం. అది బఫర్ జోన్ పరిధిలోనే ఉందనేది మా వాదన. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.

- మా దగ్గర కట్టడమే లేదు.. అక్కడ ప్లాంట్ ఉంది

మా వ్యవసాయ భూమిలో ఎలాంటి కాంక్రీట్ నిర్మాణం లేదు. అయినా రివర్‌బెడ్‌ను ఆక్రమించామంటూ చర్యలకు వచ్చారు. మరి బఫర్ జోన్‌లో హెరిటేజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందని మేము ఆధారాలతో ప్రశ్నిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మా విషయంలో చూపిన ఉత్సాహాన్నే అక్కడ కూడా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు చూపించాలి.

- ముఖ్యమంత్రి కుటుంబానికి ప్రత్యేక చట్టమా?

చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ముఖ్యమంత్రికి ఒక చట్టం, ఆయన కుటుంబానికి మరో చట్టం, ప్రతిపక్షానికి ఇంకో చట్టం ఉండకూడదు. మా భూమిపై చర్యలు తీసుకోవడం సరైనదని ప్రభుత్వం భావిస్తే, హెరిటేజ్‌కు సంబంధించిన బఫర్ జోన్ అంశంపైనా అదే ప్రమాణాలతో వ్యవహరించాలి. లేకపోతే రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తోందని ప్రజలు భావిస్తారు.

- హెరిటేజ్‌పై చర్య తీసుకునే ధైర్యం ఉందా?

మాది తప్పని మీరు భావించి చర్యలు తీసుకున్నారు. మరి బఫర్ జోన్‌లో ఉందని మేము చెబుతున్న హెరిటేజ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో చర్య తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ప్రజలందరికీ ఒకే న్యాయం అమలు చేస్తున్నామని నిరూపించాలంటే అక్కడ కూడా ఇదే చట్టాన్ని అమలు చేయాలి.

- న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం

తొమ్మిది ఎకరాల భూమి వ్యవహారంపై మేము న్యాయపోరాటం కొనసాగిస్తాం. కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జరిగిన పరిణామాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఎవరిది సరైన వాదనో, ఎవరిది తప్పో కోర్టులోనే తేలుతుంది. చట్టంపై, న్యాయస్థానంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.

- మా పోరాటం మరింత ఉధృతం చేస్తాం

మమ్మల్ని భయపెట్టి, మా నోళ్లు మూయించవచ్చని అనుకుంటే అది జరగదు. మా ఆస్తులన్నింటినీ ధ్వంసం చేసినా ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు. ఇంతకు రెట్టించిన వేగంతో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాం. పార్టీ గొంతుకగా, ప్రజల గొంతుకగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తూనే ఉంటాం.

- రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు

అధికారం శాశ్వతం కాదు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి. రాజకీయ కక్ష సాధింపుతో వ్యవస్థలను ఉపయోగించడం మానుకోవాలి. ప్రభుత్వం చేసిన ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది అని భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top