పెట్టుబడులపై చంద్రబాబు ప‌చ్చి అబ‌ద్ధాలు

గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్ 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి

రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు.. 25 లక్షల ఉద్యోగాలంటూ ప్ర‌చారం 

డీపీఐఐటీ లెక్కల ప్ర‌కారం పెట్టుబడులు రూ.6,900 కోట్లే

ఆ ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ పూర్త‌యినా వ‌చ్చే ఉద్యోగాలు కేవ‌లం 22 వేలే

చంద్ర‌బాబు ప్ర‌చారాన్ని ప్రెస్మీట్‌లో తిప్పికొట్టిన గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి 

రెండేళ్ల కూట‌మి పాల‌న‌లో శాశ్వత ఆస్తుల కల్పన శూన్యం

నెల‌నెలా పెరుగుతున్న అప్పులు.. ఆదాయం వృద్ధిలో ప‌త‌నం 

రెండేళ్లలో 4,500 ఎంఎస్‌ఎంఈల మూత.. 49 వేల మంది ఉపాధికి కోత 

దావోస్ పర్యటనలు, లక్షల కోట్ల ఎంఓయూల పేరుతో పబ్లిసిటీ 

సంక్షేమం, పరిశ్రమలు, ఉపాధి, శాంతిభద్రతలు.. అన్ని రంగాల్లో ప్ర‌భుత్వం విఫలం

చంద్రబాబు పాల‌న‌పై గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్  

వైఎస్సార్సీపీ హ‌యాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్ ఏపీ 

రెండేళ్ల కూట‌మి పాల‌న‌లో ఎనిమిదో స్థానానికి దిగజారిన ప‌రిస్థితి 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దక్షిణాదిలో నంబర్‌వన్‌గా ఏపీ

ఆర్బీఐ లెక్కల ప్రకారం కూడా ఇండస్ట్రీ జీవీఏలో దక్షిణాదిలో ఏపీ నంబర్ వన్

మేం చెబుతున్న లెక్కల్లో తప్పుంటే బహిరంగ చర్చకు సిద్ధం

కూట‌మి ప్ర‌భుత్వానికి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి స‌వాల్ 

తాడేపల్లి:  రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రచారమంతా అబ‌ద్ధ‌మని చెప్ప‌డానికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే నిద‌ర్శ‌న‌మని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. పార్లమెంట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీపీఐఐటీ ఇచ్చిన వివరాలను ఆయ‌న వెల్ల‌డించారు. ఆ లెక్క‌ల ప్రకారం రెండేళ్లలో రాష్ట్రంలో రూ.6,900 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులే జరుగుతున్నాయని, మొత్తం పది పరిశ్రమలకు సంబంధించిన ఈ పెట్టుబడుల్లో రెండు మాత్రమే పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అవ‌న్నీ పూర్తయినా దాదాపు 22 వేల ఉద్యోగాలు మాత్రమే వస్తాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని ఆయ‌న వివరించారు. మరోవైపు రెండేళ్ల చంద్రబాబు కూట‌మి పాల‌న‌లో దాదాపు 4,500 ఎంఎస్‌ఎంఈలు మూతపడి, సుమారు 49 వేల మంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హ‌యాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్‌వన్ గా ఉన్న ఏపీని రెండేళ్లలో చంద్ర‌బాబు ఎనిమిదో స్థానానికి దిగజార్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దక్షిణాదిలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంద‌ని, ఆర్బీఐ లెక్కల ప్రకారం కూడా ఇండస్ట్రీ జీవీఏలో దక్షిణాదిలో ఏపీ నంబర్ వన్ ఉంద‌ని గ‌ణాంకాల‌ను ప్ర‌ద‌ర్శించారు. తాను చెబుతున్న లెక్కల్లో తప్పుంటే బహిరంగ చర్చకు సిద్ధమ‌ని గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి కూట‌మి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు.  

ఆయ‌న ఇంకా ఏం మాట్లాడారంటే...

ఆ రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు ఎక్క‌డ‌? 

చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని చెబుతున్నారు. కానీ పార్లమెంట్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీపీఐఐటీ ఇచ్చిన సమాచారం వేరుగా ఉంది. రెండేళ్లలో రూ.6,900 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులే జరుగుతున్నాయి. అవి కూడా పది పరిశ్రమలకు సంబంధించినవి. వాటిలో రెండు మాత్రమే పురోగతిలో ఉన్నాయి. ఈ పది పరిశ్రమలు పూర్తయినా వ‌చ్చే ఉద్యోగాలు 22 వేలు మాత్ర‌మేన‌ని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. మరి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ డీపీఐఐటీ సమాచారం ప్రకారం కనిపిస్తున్న ఉద్యోగాల సంఖ్య 22 వేలు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం ఒకటి చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మరో లెక్క చెబుతోంది. ప్రజలు ఎవరి లెక్కలను నమ్మాలి? పబ్లిసిటీ కోసం కాకి లెక్కలు చెప్పడం కాదు.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి.

4,500 ఎంఎస్‌ఎంఈలు మూత.. 49 వేల ఉద్యోగాలు కోత 

భారీ పరిశ్రమలు మాత్రమే కాదు.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకుంటేనే పెద్దఎత్తున ఉపాధి లభిస్తుంది. జగన్ గారి ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈలకు క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలు అందించాం. కానీ ఈ రెండేళ్లలో దాదాపు 4,500 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని లోక్‌సభలో ఇచ్చిన సమాచారమే చెబుతోంది. వాటి కారణంగా దాదాపు 49 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవైపు కొత్తగా 22 వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్రం చెబుతుంటే.. మరోవైపు దాదాపు 49 వేల ఉద్యోగాలు పోయాయి. ఇదేనా చంద్రబాబు చెప్పే సంపద సృష్టి?

దావోస్ పర్యటనలు.. పీఆర్ ప్రచారం తప్ప ఫలితమేది?

దావోస్‌కు వెళ్తున్నాం, లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తును మార్చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. పర్యటనలు, పీఆర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంత పెట్టుబడి గ్రౌండ్ అయింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? కేంద్ర ప్రభుత్వ గణాంకాలు బయటకు వచ్చిన తర్వాతైనా చంద్రబాబు వాస్తవాలు చెప్పాలి.

నంబర్‌వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని ఎనిమిదో స్థానానికి దిగజార్చారు

2019-24 మధ్య వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇప్పుడు రెండేళ్ల కూటమి పాలనలో నీతి ఆయోగ్ నివేదికలో ఎనిమిదో స్థానానికి ఎందుకు దిగజారిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరి పాలనలో పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఎవరి పాలనలో పరిస్థితి దిగజారిందో ఈ లెక్కలే చెబుతున్నాయి.
జగన్ గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో దక్షిణ భారతదేశంలో నంబర్‌వన్‌గా ఉంది. దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. ఇండస్ట్రీ జీవీఏలో కూడా దక్షిణాదిలో నంబర్‌వన్‌గా, దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇవి మేం తయారు చేసిన లెక్కలు కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల్లో ఉన్న గణాంకాలు. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు పారిశ్రామిక రంగంలో వెనక్కి తీసుకెళ్లారు.

రామాయపట్నం పోర్టుతోనే భారీ పెట్టుబడులకు బాట

జగన్ గారి ముందుచూపుతో చేపట్టిన రామాయపట్నం పోర్టు వల్లే ఇండోసోల్ వంటి భారీ పెట్టుబడులకు మార్గం ఏర్పడింది. బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకు కూడా రామాయపట్నం పోర్టు కీలకంగా మారింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ వంటి సంస్థలు కూడా అక్కడి అవకాశాలను వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. పోర్టును దాదాపు పూర్తి స్థాయికి తీసుకొచ్చింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల ఫలితాలకు చంద్రబాబు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్నారు.

అప్పులు చేశారు.. ఆస్తులు ఎక్కడ?

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కరోనా వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమాన్ని కొనసాగించింది. నాడు-నేడు ద్వారా స్కూళ్లు, ఆస్పత్రులు అభివృద్ధి చేశాం. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి శాశ్వత ఆస్తులను సృష్టించాం. ఇప్పుడు రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని చెబుతున్నాం. మరి ఆ అప్పులతో ప్రజలకు కనిపించేలా ఏం నిర్మించారు? ఏ శాశ్వత ఆస్తులు సృష్టించారు? 
సంపద సృష్టిస్తానని చంద్రబాబు పదే పదే చెబుతారు. కానీ రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఏమిటి? రెవెన్యూ డెఫిసిట్ ఎందుకు పెరిగింది? పన్నుల ఆదాయంలో రాష్ట్రం ఎందుకు వెనుకబడింది? జీఎస్టీ వసూళ్లు, ఇతర ఆదాయ సూచికలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బయటపెడుతున్నాయి. అంకెలతో ఆర్భాటం చేయడం కాదు.. వాస్తవ ఆదాయం పెరగాలి. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.

రాజకీయ కక్ష సాధింపులకు పోలీసుల‌ను వాడుతున్నారు

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారిపోయింది. మహిళలకు, బాలికలకు, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతోంది. పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అధికార పార్టీ నేతల ఆదేశాలకు పనిచేసే పరిస్థితికి తీసుకొచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అరెస్టు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించడం పరిపాలన కాదు. వ్యవస్థలను స్వేచ్ఛగా, చట్టబద్ధంగా పనిచేయనివ్వాలి. అమ్మఒడి అంటే ప్రజలకు జగన్ గారే గుర్తుకొస్తారు. ఇప్పుడు పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టినా ప్రజల మనసుల్లో అది అమ్మఒడిగానే ఉంది. విద్యార్థులకు ట్యాబ్‌లు అందించడం, డిజిటల్ క్లాస్‌రూమ్స్ తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం వంటి విద్యా సంస్కరణలను ఎవరు తీసుకొచ్చారంటే ప్రజలు జగన్ గారి పేరే చెబుతారు. పేరు మార్చడం ద్వారా ఆ ముద్రను చెరపలేరు.

తప్పుంటే బహిరంగ చర్చకు సిద్ధం

మేం ఈ లెక్కలన్నీ కేంద్ర ప్రభుత్వ శాఖలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ వంటి సంస్థల నివేదికల్లో ఉన్న అంశాలనే ప్రజల ముందు పెడుతున్నాం. మేం చెప్పిన ఇండస్ట్రీ జీవీఏ, మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన లెక్కల్లో ఏదైనా తప్పుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధం. ప్ర‌తిపక్షం, జగన్ గారిపై వ్యక్తిగత నిందలు వేస్తూ కాలం గడపడం మానాలి. ఎదురుదాడులు, అసత్య ప్రచారం, బూతు సంస్కృతిని పక్కన పెట్టాలి. వ్యవస్థలను స్వేచ్ఛగా పనిచేయనివ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేసి, రేపు అధికారం ఉన్నా లేకపోయినా ఫలానా మంచి పని చేశామని గర్వంగా చెప్పుకునేలా పాలన చేయాలి. రెండేళ్లలో రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి హిత‌వు ప‌లికారు.

Back to Top