మెగా డీఎస్సీలో అక్రమాలపై పార్లమెంటులో చర్చ జరగాలి

ఉభయ సభల్లో వాయిదా తీర్మానం కోరిన వైయస్సార్‌సీపీ

న్యూఢిల్లీ: టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుని 16 వేల మంది టీచర్లను నియమిస్తూ, నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చ జరగాలని వైయస్సార్‌సీపీ కోరుతోంది. ఈ మేరకు ఉభయ సభల్లో వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది.
    లోకసభలో ఎంపీ ఎం.గురుమూర్తి, రాజ్యసభలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆ తీర్మానాలు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో రూల్‌–267 కింద నోటీస్‌ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలు, దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును అయోమయానికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 22.79 లక్షల మంది ‘నీట్‌’ అభ్యర్థుల సమస్యపై పార్లమెంటులో చర్చించినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లో 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న మెగా డీఎస్సీ అక్రమాలపైనా చర్చ జరగాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఇది నిరుద్యోగ యువత భవిష్యత్తు, ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలకు సంబంధించిన అంశమని తెలిపారు.
    గోప్యంగా జరగాల్సిన పరీక్ష నిర్వహణను ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి అప్పగించడం, మెరిట్, రోస్టర్‌ జాబితాలను ప్రకటించకపోవడం, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తర్వాత కూడా అభ్యర్థులను తొలగించడం, స్పోర్ట్స్‌ కోటా నిబంధనల్లో మార్పులు, ప్రశ్నపత్రాల లీకేజీ, డబ్బులకు ఉద్యోగాల వ్యవహారం, అడ్డగోలుగా నియామకాలు.. ఇవన్నీ వెరసి టీచర్‌ అభ్యర్థుల విశ్వాసాన్ని దెబ్బ తీశాయని ఈ సందర్భంగా వైయస్సార్‌సీపీ ఎంపీలు తేల్చి చెప్పారు.
    ఈ వ్యవహారంపై నిర్ణీత గడువులో స్వతంత్య్ర ప్రతిపత్తితో దర్యాప్తు జరిపించాలని, డిజిటల్‌ «ఆధారాలను భద్రపరచాలని, అర్హులైన టీచర్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షపాతం, విశ్వసనీయతను కాపాడే సంస్కరణలు తీసుకురావాలని వైయస్సార్‌సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీటన్నింటినీ చర్చించాల్సి ఉందని, అందుకే పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు కోరినట్లు వైయస్సార్‌సీపీ ఎంపీలు వివరించారు.

Back to Top