కూటమి ప్రభుత్వంలో బడుగులకు భద్రత కరవు

 వైయ‌స్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు

వైయ‌స్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఫైర్‌

అనంతపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలకు భద్రత కరవైందని వైయ‌స్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మండిపడ్డారు. వైయ‌స్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా వైయ‌స్సార్‌సీపీ కార్యాలయంలో బీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో వైయ‌స్సార్‌సీపీ బీసీ నాయకుడు గోవిందు అల్లుడు జయకుమార్ కొనుగోలు చేసిన 21 ఎకరాల వ్యవసాయ భూమిలోని బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేసి, భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రమేష్ గౌడ్ ఆరోపించారు. పలుమార్లు అధికారులు, పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదన్నారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాయదుర్గం, కళ్యాణదుర్గం, కనగానపల్లి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీసీలు, మహిళలపై జరిగిన పలు ఘటనలను ప్రస్తావిస్తూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. కుప్పంలో బీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన, గుంటూరులో మహిళపై జరిగిన దాడి వంటి ఘటనలు రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను గుర్తుచేసుకునే చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి రక్షణను విస్మరించారని రమేష్ గౌడ్ విమర్శించారు. అక్రమ కేసులు, వేధింపులు, దాడులకు గురవుతున్న వారికి వైయ‌స్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే వైయ‌స్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీఈసీ సభ్యుడు సుగుమంచిపల్లి రంగన్న, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దేవేంద్ర తదితరులు మాట్లాడుతూ బీసీలపై కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి, ఉరవకొండ భూ వివాదంలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 

Back to Top