విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో కాలయాపన చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నేతలు మండిపడ్డారు. విశాఖపట్నం లోని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, రెండేళ్ల పాలన పూర్తయినా ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, గిరిజన యువత స్వచ్ఛందంగా చేపడుతున్న ఉద్యమాలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3 రద్దు అంశంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని, గత ప్రభుత్వంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ వివరాలను ప్రెస్ ముఖంగా బహిర్గతం చేశారు. ఇప్పటికైనా జీవో నంబరు 3 పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజనుల తరపున పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎవరేమన్నారంటే.. - రివ్యూ పిటిషన్ వేయలేదనడం పచ్చి అబద్ధం - కూటమి ప్రభుత్వానికి సవాల్ : పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎన్నికల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలను బొందపెట్టి, అధికారంలోకి వచ్చాక కళ్ల బొల్లి మాటలతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జీవో నెంబర్ 3 విషయంలో అసలు వాస్తవాలు గిరిజన సోదరులకు తెలియాలి. 2002లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టులో కేసులు (Civil Appeal Nos. 3609/2002, 7040/2002) పడ్డాయి. 18 ఏళ్ల సుదీర్ఘ వాదనల అనంతరం 2020 ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు జీవో 3ని రద్దు చేసింది. దీనిపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వెంటనే స్పందించి, 2020 జూన్ 18న 111వ ఏపీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (TAC) సమావేశంలో తీర్మానం చేసి, జులై 13న సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ (Diary No. 14598/2020) దాఖలు చేసింది. 2024 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌తో పాటు మరో 15 రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మేము రివ్యూ పిటిషనే వేయలేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న ఐఏఎస్ అధికారులు, లా సెక్రటరీలతో వైయస్ఆర్‌సీపీప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదని చెప్పించే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? స్వచ్ఛందంగా రోడ్డెక్కిన ఏజెన్సీ యువతకు జీవో 3పై నాలెడ్జ్ లేదనడం, వారిని వైయస్ఆర్‌సీపీ ప్రలోభపెట్టిందని అనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. వైయస్.జగన్ హయాంలోనే ఎస్టీ కమిషన్‌ను వేరు చేశాం, సచివాలయం, వాలంటీర్ ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే ఇచ్చాం. 3.22 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి 1.70 లక్షల మంది రైతులకు మేలు చేశాం. ఐదేళ్లలో రూ.20,000 కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేశాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి జీవో 3ని వెంటనే పునరుద్ధరించాలి. - అబద్ధాలతో గెలిచి గిరిజనులను మోసం చేస్తున్నారు : పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి కూటమి నాయకులు అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచారు. 2002లో జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో పిటిషన్ పడినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. 2002 నుండి 2004 వరకు ఆయనే లాయర్లను పెట్టారు. మేము అధికారంలోకి వచ్చాక కూడా ఆ లాయర్లనే కొనసాగించాం. మరి ఆ రోజే చంద్రబాబు హయాంలో సమర్థవంతమైన వాదనలు ఎందుకు వినిపించలేదు? 2020లో కరోనా క్లిష్ట సమయంలో సుప్రీం కోర్టు జీవోను రద్దు చేస్తే, వైయస్.జగన్ గారిపై నిందలు వేశారు. ఎన్నికల ప్రచారంలో మన్యం జిల్లా, పాడేరు, అరకు, సాలూరులలో లోకేష్, చంద్రబాబులు జీవో 3 పునరుద్ధరిస్తామని గంటలు కొట్టి చెప్పారు. మరి ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎందుకు పునరుద్ధరించడం లేదు? మా హయాంలో గిరిజన సంఘాలు, యువత ధర్నాలు చేస్తే మానవత్వంతో ఆలోచించి ఎవరిపైనా కేసులు పెట్టలేదు. కానీ ఈ రోజు హక్కుల కోసం పోరాడుతున్న 15-25 మంది గిరిజన యువతపై కేసులు పెడుతున్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా లేక ముస్సోలిని తరహా నియంత ప్రభుత్వమా? రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి, కేంద్రంతో మాట్లాడి లేదా ప్రత్యేక చట్టం తీసుకువచ్చి గిరిజనులకు న్యాయం చేయాలి. - హక్కులను కాలరాస్తే ఏజెన్సీ తిరగబడుతుంది : రేగ మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ఆయువుపట్టు లాంటి జీవో నెంబర్ 3 రద్దయితే, దానిని పరిష్కరించాల్సింది పోయి వైఎస్.జగన్ ని టార్గెట్ చేయడం సిగ్గుచేటు. ప్రత్యామ్నాయ జీవో తెస్తామని ఏజెన్సీలో డబ్బాలు కొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలకు భూములు ఇచ్చింది ఆదివాసీలు. కానీ ఉద్యోగాల్లో 6% మాత్రమే ఇస్తూ 94% గిరిజనేతరులకు కట్టబెడితే గిరిజన యువత ఎలా బ్రతకాలి? మరోవైపు 1/70 యాక్ట్‌ను తుంగలో తొక్కి మైదాన ప్రాంత వాసులు ఏజెన్సీ భూములను కబ్జా చేస్తున్నారు. గిరిజన చట్టాలు, హక్కులపై సరైన రీతిలో స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రరూపం దాల్చుతాయి. - గిరిజన చట్టాల జోలికొస్తే ఊరుకునేది లేదు : కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే 100% ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలని తెచ్చిన జీవో 3 రద్దును రాజకీయంగా వాడుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇంకా 'స్టడీ చేస్తున్నాం' అని సాకులు చెప్పడం విడ్డూరం. ఒకవైపు జీవో 3ని నిర్వీర్యం చేస్తూ, మరోవైపు వన్ ఆఫ్ 70 (1/70) యాక్ట్‌ను కూడా సవరించాలని చూస్తున్నారు. సాక్షాత్తు అసెంబ్లీలోనూ, విశాఖ టూరిజం మీటింగ్‌లోనూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 యాక్ట్ అభివృద్ధికి అడ్డుపడుతోందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. వైయస్. జగన్ వరదల సమయంలోనూ 1/70 యాక్ట్ షెడ్యూల్డ్ ప్రాంతాల రక్షణ కవచమని స్పష్టంగా చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపిన గిరిజన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం ఆపాలి. మా రాజ్యాంగ హక్కుల జోలికి వస్తే గిరిజనులంతా ఏకమై బుద్ధి చెప్తారు. - స్పష్టమైన కార్యాచరణతోనే జీవో 3 పునరుద్ధరణ సాధ్యం : డా. డివిజి శంకర్ రావు, ఏపీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్. సుప్రీం కోర్టులోని 5 గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం జీవో 3ని కొట్టివేసింది. దానిని పునరుద్ధరించాలంటే ఎంతో నిర్మాణాత్మకమైన కృషి జరగాలి. ఎస్టీ కమిషన్ తరఫున జీవో 3 వల్ల గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో జరిగిన మార్పులపై పూర్తి సర్వే నివేదికను ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు సమర్పించాం. చంద్రబాబు నాయుడు జీవో 3ని పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కేవలం పొలిటికల్ రిటోరిక్ (రాజకీయ ఉపన్యాసాలు)తో సరిపెట్టకుండా, ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా గట్టి నిర్మాణాత్మక కృషి చేయాలని కోరుతున్నాం. - అబద్ధాల ప్రచారాన్ని గిరిజనులు నమ్మరు : జల్లిపల్లి సుభద్ర, విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరూ జీవో 3 విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. 2002లో కేసు పడినప్పుడు, 2014లో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. అప్పుడు గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి జీవో 3 గురించి ఎందుకు నోరు విప్పలేదు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 1700 మంది నాన్-ట్రైబ్స్ 1/70 యాక్ట్‌కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళ్లారంటే దీని వెనుక కూటమి నేతల ప్రోద్బలం ఉందనేది స్పష్టమవుతోంది. పాడేరులో 15 వేల నుంచి 20 వేల మంది గిరిజన యువకులు స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ చేశారు తప్ప వైయస్ఆర్‌సీపీ రెచ్చగొట్టలేదు. గిరిజనులను మోసం చేయడం ఆపి, వారి గోడును వినాలి. - చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి : పసుపులేటి.బాలరాజు, మాజీ మంత్రి లక్షలాది మంది ఆదివాసీ, గిరిజన ప్రజల రాజ్యాంగ చట్టబద్ధమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల హామీ మేరకు జీవో నంబరు 3ని పునరుద్ధరించాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా హామీని అమలు చేయకుండా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లడం సరికాదు. ఇప్పటికైనా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలి.