ఢిల్లీ: పంచదారల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. సుమారు రెండున్నర లక్షల టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించారని, దీనిపై రూ.200 కోట్ల జరిమానా విధించాలని అన్నారు. పంచదారల కొండలను నో మైనింగ్ జోన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదని తెలిపారు. ఢిల్లీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. పవిత్ర ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ గ్రావెల్ తరలింపు పంచదారల కొండల్లో సీఎం రమేష్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, తన పీఏ పేరుతో మైనింగ్ లీజు తెచ్చుకున్నారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచదారల కొండ మైనింగ్ క్వారీ లీజు సీఎం రమేష్ ఆఫీస్ సెక్రటరీపై ఉందన్నారు. రిత్విక ప్రాజెక్టు వాహనాల్లో గ్రావెల్ తరలించారని తెలిపారు. పురావస్తు శాఖ రక్షిత ప్రాంతమైన పంచదారల కొండల్లో ప్రజలు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని, మైనింగ్, బ్లాస్టింగ్‌తో కొండల పవిత్రత, ప్రకృతి దెబ్బతింటున్నాయని అన్నారు. పవిత్ర జలాలు వచ్చే పంచదార నుంచి ఇప్పుడు బురద నీరు వస్తోందని, మైనింగ్ బ్లాస్టింగ్ వల్లే బురద నీరు వస్తోందని ప్రభుత్వం చెబుతోందన్నారు. పది రోజుల్లో కేంద్ర బృందం.. నివేదికపై వారం రోజుల్లో చర్యలు పంచదారల మైనింగ్‌ను పరిశీలించేందుకు రానున్న పది రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపిస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ హామీ ఇచ్చారని, నివేదిక వచ్చిన వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచదారల నుంచి రెండున్నర లక్షల టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించిన వ్యవహారంపై రూ.200 కోట్ల జరిమానా విధించాలి. కలెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఎంపీ సీఎం రమేష్ రాజీనామా చేయాలి. ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎక్కడి నుంచో వచ్చి తమ ప్రాంతాన్ని దోచుకుంటున్న సీఎం రమేష్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.