ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పంచదర్ల హెరిటేజ్ ల్యాండ్‌స్కేప్ పరిధిలో జరుగుతున్న మైనింగ్, బ్లాస్టింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని ‘మైనింగ్ ఫ్రీ హెరిటేజ్ జోన్’గా ప్రకటించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు లేఖ అందజేశారు. ఏఎస్ఐ రక్షిత ధనదిబ్బలు బౌద్ధ పురావస్తు ప్రాంతం, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయాలకు సమీపంలో జరుగుతున్న మైనింగ్ వల్ల చారిత్రక వారసత్వ సంపదకు ముప్పు ఏర్పడుతోందని గురుమూర్తి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రక్షిత ప్రాంతానికి కేవలం 90 మీటర్ల దూరంలోనే మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఇది ఏఎస్ఐ చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నారు. 2024–25లో మైనింగ్ విస్తరణ జరిగినట్లు సాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోందని తెలిపారు. బౌద్ధ, హిందూ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని, అప్పటివరకు మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై జాయింట్ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించి సమగ్ర పరిశీలన చేపట్టాలని గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. భారత పురాతన బౌద్ధ నాగరికతకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లతో పాటు శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని పరిరక్షించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.