మహానేత.. మనసా స్మరామి

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహానేత వైయ‌స్ఆర్ 77వ జయంతి వేడుకలు

వాడవాడలా వైయ‌స్ఆర్‌కు ఘన నివాళులు.. 

సేవా కార్యక్రమాలతో మహానేతకు అభిమానుల నివేదనం

తాడేపల్లి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు మహానేత విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కటింగ్, అన్నదానం, రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం, పాలాభిషేకాలు వంటి సేవా కార్యక్రమాలతో మహానేత సేవా స్ఫూర్తిని స్మరించుకున్నారు.

ఇడుపులపాయలో వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మహానేతకు ఘన నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని మహానేత సేవలను కొనియాడారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వైయ‌స్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మహానేత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైయ‌స్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజాసేవను కొనియాడారు.

తెలంగాణలోనూ మహానేత జయంతి వేడుకలు విశేషంగా నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైయ‌స్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి రైతులు, పేదల కోసం ఆయన చేసిన సేవలను స్మరించారు. కోదాడలో భారీ క్రేన్‌తో వైయ‌స్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ప్రజలకు పులిహోర పంపిణీ చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో వైయ‌స్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సంక్షేమ కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు.

జాతీయ స్థాయిలోనూ మహానేతకు నివాళులు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వైయ‌స్ఆర్‌ను విజనరీ నాయకుడిగా అభివర్ణించగా, రాహుల్ గాంధీ ఆయనను ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన నిజమైన రాజనీతిజ్ఞుడిగా కొనియాడారు.

రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత వైయ‌స్ఆర్ ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన చూపిన ప్రజాసేవా మార్గమే సమాజానికి ఆదర్శమని తెలుగు రాష్ట్రాల ప్రజలు మరోసారి ఘనంగా చాటిచెప్పారు. వాడవాడలా జరిగిన జయంతి వేడుకలు మహానేతపై ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి, విశ్వాసానికి నిదర్శనంగా నిలిచాయి.

Back to Top