శ్రీ సత్యసాయి జిల్లా: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పెనుకొండలో అడ్డుకుని అరెస్ట్ చేయగా, పలువురు పార్టీ నాయకులను వివిధ ప్రాంతాల్లో నిలిపివేయడం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రాప్తాడుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌ను పోలీసులు పెనుకొండలో అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఉషాశ్రీచరణ్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రతిపక్ష నాయకులను పరామర్శించే హక్కును కూడా హరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె మండిపడ్డారు. మరోవైపు, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి మద్దతుగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన 'చలో అనంతపురం` కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. కదిరి నుంచి అనంతపురానికి బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ సమన్వయకర్త ఎస్. ఎం.డి. ఇస్మాయిల్, జిల్లా ఉపాధ్యక్షుడు బైక్ భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలను ముదిగుబ్బ వద్ద అడ్డుకుని ముందుకు వెళ్లకుండా నిలిపివేశారు. అలాగే హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి రాప్తాడుకు బయలుదేరేందుకు సిద్ధమైన నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీమతి టి.ఎన్. దీపికను పోలీసులు ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అనంతపురానికి బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులకు పాల్పడటం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రతిపక్ష గొంతును పోలీసు బలంతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను హరించే ఇటువంటి నిర్బంధ చర్యలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండించింది.