తాడేపల్లి: ఆఖరి క్షణం వరకు ఉద్యమాలే ఊపిరిగా బతికిన గొప్ప పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం అని, ఆయన మృతి వైయస్ఆర్‌సీపీ తీరని లోటని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల పార్టీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి వస్తారనుకుంటున్న తరుణంలో ఆయన శాశ్వతంగా కన్నుమూయడం తమను తీవ్రంగా కుంగదీసిందని ఆవేదన చెందారు. కాపు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ముద్రగడ గారిని టీడీపీ ప్రభుత్వం ఎంతగానో వేధించిందని, అయినా పోరాటంలో వెన్నుచూపకుండా ఆయన చూపించిన తెగువ నేటి యువతకు స్ఫూర్తి అని నాయకులు కొనియాడారు. చిన్న వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపించిన నిబద్ధత చివరి క్షణం వరకు కొనసాగించారని ప్రశంసించారు. ముద్రగడ ఆలోచనలను వైయస్ఆర్‌సీపీ ముందుకు తీసుకెళ్తుందని వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు ఆరె శ్యామల, మళ్లీశ్వరి, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. జీవితాంతం రాజీలేని పోరాటం - గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తన జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన గొప్ప మనిషి ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నాయకుడు. ఆయన దూరం కావడం వైయస్ఆర్‌సీపీకి తీరని లోటు. ముద్రగడ గారి ఆశయాలను వైయస్ఆర్‌సీపీ ముందుకు తీసుకెళ్తుంది. వారి కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్నాం - లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడిగా, కాపు ఉద్యమకారుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. మంత్రిగా, ఎంపీగా ప్రజలకు ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి వస్తారనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం ఆయన అభిమానులను తీవ్రంగా కుంగదీస్తుంది. గొప్ప పోరాటయోధుడు - వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఎంపీగా ఎన్నో మంచి కార్యక్రమాలు రూపొందించారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపించిన నిబద్ధత చివరి క్షణం వరకు కొనసాగించారు. కాపు ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ముద్రగడ గారిని టీడీపీ ప్రభుత్వం ఎంతగానో వేధించింది. అయినా పోరాటంలో వెనక్కి తగ్గకుండా ఆయన చూపించిన తెగువ నేటి యువతకు స్ఫూర్తి. ఆయన మరణం వైయస్ఆర్‌సీపీకి తీరని లోటు. ప్రజా ఉద్యమాల్లో చెరగని ముద్ర - మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే రాజకీయాల్లో నీతి నిజాయితీలతో ముద్రగడ పద్మనాభం గారు పనిచేశారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన చెరగని ముద్రవేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. కాపు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్తాం - దేవినేని అవినాశ్, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాపుల పక్షాన ఉద్యమించిన పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించి భోజనం పెట్టే గొప్ప మనిషి. ముద్రగడ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ముద్రగడ ఆలోచనలను ముందుకు తీసుకెళ్తాం. ఆత్మగౌరవంతో బతికారు - ఆరె శ్యామల, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ముద్రగడ పద్మనాభం గారు తన జీవితం మొత్తం కాపుల గొంతుకగా నిలిచారు. పోరాటానికి ఆయన నిలువెత్తు స్ఫూర్తి. అధికార తెలుగుదేశం పార్టీతో ఆత్మాభిమానంతో యుద్ధం చేసిన నాయకుడు. కాపుల సంక్షేమం కోసం ఆయన ఆలోచనలను వైయస్ఆర్‌సీపీ ముందుకు తీసుకెళ్తుంది.