కిర్లంపూడి: మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి నివాసానికి చేరుకున్న ఆయన, పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అశ్రునివాళి అర్పించారు. అనంతరం ముద్రగడ పద్మనాభం గారి సతీమణి, కుమారుడు శ్రీ ముద్రగడ గిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీ వైయస్ జగన్, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముద్రగడ పద్మనాభం గారితో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్న శ్రీ వైయస్ జగన్, ఆయన ప్రజాసేవ, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా గుర్తుండిపోతారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీ వైయస్ జగన్ అక్కడే ఉండి నివాళులు అర్పించారు. అనంతిమయాత్రలో స్వయంగా పాల్గొని ముద్రగడ పద్మనాభం గారి పాడెను మోసి, ఆయన పట్ల తనకున్న గౌరవం, ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముద్రగడ పద్మనాభం గారికి అశ్రునివాళులు అర్పించారు.