కళ్యాణదుర్గం: వైయస్ఆర్‌సీపీ రాయలసీమ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న హంద్రీ-నీవా రెండో దశ కాలువ యాత్రను* ప్రజలు, రైతులు, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా రాయలసీమ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తలారి రంగయ్యతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ-నీవా మొదటి దశ కాలువ వెడల్పు పనులు, రెండో దశ లైనింగ్ పనుల కోసం గత రెండేళ్లలో సుమారు రూ.3,850 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ, ఆ వ్యయానికి తగిన ఫలితాలు రైతులకు అందాయా, పనుల నాణ్యత ఎలా ఉంది, లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. ఈ యాత్రలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సభ్యులు, సాంకేతిక నిపుణులు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని, ముఖ్యంగా హంద్రీ-నీవా రెండో దశ కాలువ పరిధిలోని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు లక్ష్యాలు, గత నాలుగు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు చేపట్టిన పనులు, వాటి ఫలితాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు, ప్రాజెక్టు అమలులోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల వద్ద కూడా ఇలాంటి క్షేత్రస్థాయి యాత్రలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను శాస్త్రీయ ప్రణాళికతో, నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పిస్తామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఐటీ విభాగం జోనల్ అధ్యక్షుడు మంజునాథ్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మండల కన్వీనర్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.