అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వరుసగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరమని వైయస్ఆర్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. పెద్దవడగూరు వైయస్ఆర్‌సీపీ నేత చిదంబర్‌రెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఇటీవల చిదంబర్‌రెడ్డి ఇంటి వద్ద జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో హంగామా సృష్టించిన నేపథ్యంలో ఆయనకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 24 మంది వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తామంటే చర్యలేవి? తాడిపత్రి నియోజకవర్గంలో 24 మంది వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగంగా ప్రకటించినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని పెద్దారెడ్డి ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తానంటూ బాహాటంగా మాట్లాడుతున్నా చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం దేనికి సంకేతమని నిలదీశారు. ‘‘వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పెద్దవడగూరు మండలంలో వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?’’ అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నా స్పందించరా? టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నా పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, ప్రతిపక్ష నేతలకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసుల వ్యవహారశైలి ఉందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను చూస్తూ మౌనంగా ఉంటే సామాన్యులకు భరోసా ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. జేసీ అరాచకాలపై ఉద్యమిస్తాం తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరాచకాలు, వాటిపై పోలీసుల ప్రేక్షకపాత్రకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరారు.