నేత‌న్న‌ల‌కు చంద్రబాబు వెన్నుపోటు

లబ్ధిదారుల సంఖ్య‌లో భారీగా కోత 

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధ్వ‌జం

వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ మురుగుడు హ‌నుమంత‌రావు 

రెండేళ్లుగా చేనేత‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం

చేనేతపై జీఎస్టీని రద్దు చేయిస్తామన్న హామీకి అతీగ‌తీ లేదు

కార్మిక సంఘాలు మొరపెట్టుకున్నా లోకేష్ లో స్పందన లేదు 

'ఆప్కో' సంస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది

మ‌గ్గం ఉన్న ప్ర‌తి కార్మికుడికీ బ‌కాయిలతో క‌లిపి సాయం అందించాలి

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు డిమాండ్ 

తాడేప‌ల్లి: చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం తీవ్ర వెన్నుపోటు పొడిచిందని, చేనేత‌ల‌కు గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమాన్ని రెండేళ్లుగా అటకెక్కించిందని ఎమ్మెల్సీ మురుగుడు హ‌నుమంత‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించి పేపర్లలో మాత్రం చేనేత‌ల‌ను ఉద్ధ‌రించిన‌ట్టు ప్రకటనలతో డ్రామాలు ఆడుతోందన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఏటా 81 వేల మందికి రూ. 24 వేల చొప్పున ఐదేళ్ల‌పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా సాయం చేసింద‌ని గుర్తుచేశారు. ఎన్నిక‌ల్లో 93 వేల మందికి సాయం చేస్తామ‌ని హ‌మీ ఇచ్చిన చంద్ర‌బాబు రెండేళ్లుగా ప‌ట్టించుకోవ‌డం మానేయ‌డమే కాకుండా ఆప్కోకు నిధులు ఇవ్వ‌కుండా, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 
ప్రభుత్వం వెంటనే పునరాలోచించి, పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ జరిపి మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి బకాయిలతో సహా సాయం అందించాలని, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు జరిపి ఆదుకోవాలని ఎమ్మెల్సీ హ‌నుమంత‌రావు డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

- చేనేత లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత 

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో  వైఎస్ జగన్ గారి పాల‌న‌లో ఏటా పారదర్శకంగా ఎన్యూమరేషన్ జరిపి, 80 వేలకు పైగా ఉన్న మగ్గం కార్మికులందరికీ క్రమం తప్పకుండా ఏడాదికి 24వేల చొప్పున ఐదేళ్లూ అందించారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటకెక్కించింది. లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించి, ఆప్కోకు నిధులు ఇవ్వకుండా, ఎన్నికల హామీలను బూడిదలో పోసిన పన్నీరు చేసి చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం తీవ్ర వెన్నుపోటు పొడిచింది.

ఎన్నికల ముందు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే చేనేతలకు మరింత బెటర్ గా చేస్తామని, దాదాపు 93వేల మందికి పైగా ఉన్న మగ్గం కార్మికులకు ఆర్థికంగా సహకరిస్తామని చెప్పారు. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక కేవలం 54వేల రూ. 25వేల ఇస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర అన్యాయం. మిగిలిన దాదాపు 26వేల మందికి పైగా కార్మికులను ఏ ప్రాతిపదికన తగ్గించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయంతో చేనేత కార్మికులు సొంతంగా నూలు (యారన్), రంగులు కొనుక్కొని, బట్టలు నేసి అమ్ముకుంటూ గౌరవంగా బతికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాలుగా చేనేత కార్మికులను కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. కార్మిక సంఘాలు లోకేష్ గారిని కలిసి మొరపెట్టుకున్నా స్పందించలేదు.

- ఆప్కోను నిర్వీర్యం చేశారు
 
చేనేత సొసైటీలు తయారు చేసిన వస్త్రాలను మార్కెటింగ్ చేయడానికి ఏర్పడిన 'ఆప్కో' సంస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది.
ప్రస్తుతం ఆప్కోలో చైర్మన్ లేడు, జిల్లాల వారీగా డైరెక్టర్ల కమిటీ లేదు, సరైన ఉద్యోగులు లేరు. వేరే డిపార్ట్‌మెంట్ల అధికారులతో నామమాత్రంగా నడిపిస్తున్నారు. గత రెండేళ్లుగా సొసైటీల నుంచి ఎంత కొనుగోలు చేశారు, ఎంత అమ్మారో వివరాలు లేవు. సొసైటీలకు రావాల్సిన సరుకు డబ్బులను రెండేళ్లుగా రిలీజ్ చేయకుండా ప్రభుత్వం తొక్కిపెట్టింది. దీనివల్ల సొసైటీలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో తెచ్చిన అప్పులకు 12 శాతం పైగా వడ్డీలు కట్టలేక దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ప్రభుత్వ సహకారం, మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో తయారు చేసిన బట్ట అమ్ముడుపోక చేనేత రంగం అగమ్యగోచరంగా మారింది. ఉపాధి లేక ఎంతో మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

- జీఎస్టీ రద్దుపై మాట తప్పారు 

చేనేత పరిశ్రమ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం. నూలు (యారన్), కాటన్, రంగులు, రసాయనాలతో పాటు తయారైన చేనేత వస్త్రంపై కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేయడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఎన్నికల ముందు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో మాట్లాడి చేనేతపై జీఎస్టీని రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేనేత ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టారు.

ప్రభుత్వం వెంటనే పునరాలోచించి, పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ జరిపి మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి బకాయిలతో సహా సాయం అందించాలని, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు జరిపి ఆదుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రెండున్నరేళ్లుగా కార్మికులు పెట్టుబడులు లేక, అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాబట్టి, కూటమి ప్రభుత్వం ఆ రెండు సంవత్సరాల బకాయిలను కూడా కలిపి కార్మికులకు చెల్లించాలని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు డిమాండ్ చేశారు.

Back to Top