శ్రీకాకుళంలో 'జగనన్న 2.0 సూపర్ యాప్' పోస్టర్ ఆవిష్కరణ 

 పార్టీ శ్రేణులను నాయకత్వంతో అనుసంధానించే వేదికే జగనన్న 2.0 సూపర్ యాప్: ధర్మాన కృష్ణదాస్ 

 శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌సీపీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా అనుసంధానం చేసే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'జగనన్న 2.0 సూపర్ యాప్` జిల్లా స్థాయి ప్రచార కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ఘనంగా ప్రారంభించారు. నగరంలోని  7 బిర్యానీస్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్  జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే శక్తివంతమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా జగనన్న 2.0 సూపర్ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల గొంతుకను అణచివేసే ప్రయత్నాలను తిప్పికొట్టడంతో పాటు, సమాచార మార్పిడి, ప్రజా సమస్యలు, పోలీసు, రాజకీయ వేధింపులపై డిజిటల్ డైరీ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, ప్రతి కార్యకర్త తప్పనిసరిగా జగనన్న 2.0 సూపర్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, యువ నాయకుడు ధర్మాన రామమనోహర్ నాయుడు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top