తాడేపల్లి: అడ్డగోలు నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా అర్హులైన ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలని వైయస్ఆర్‌సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదన్న ఆలోచనతో దేశంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ జగన్ గారు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసి చూపించారని ప్రశంసించారు. అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక నీరుగార్చేసిందని, మొదటి ఏడాది పూర్తిగా వదిలేసి రెండో ఏడాది అరకొరగా అమలు చేసిందని విమర్శించారు. యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 87 లక్షల మంది విద్యార్థులుంటే వారికి రూ. 15 వేల చొప్పున రూ. 13,112 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం 66 లక్షల మందికి కేవలం రూ. 10,126 కోట్లు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం విద్యార్థులను వంచించడమే అవుతుందన్నారు. తల్లికి వందనం అనేది ఒక పథకంగా కాకుండా పేద విద్యార్థుల తలరాతలు మార్చే విద్యావిప్లవంగా చూడాలని హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - 87 లక్షల మందికిగాను 66 లక్షల మందికే అమలు వైయస్ఆర్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ గారు చదువులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదన్న ఆలోచనతో దేశంలో ఎవరూ చేయని విధంగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసి చూపించారు. అంతేకాకుండా నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులను ప్రయివేటుకి దీటుగా తీర్చిదిద్దారు. బడులను ఆధునికీకరించి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంతోపాటు సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చారు. కూటమి నాయకులు ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ప్రచారం ఊదరగొట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ గారి మానస పుత్రిక అయిన అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనంగా పేరు మార్చి వదిలేశారు. తొలి ఏడాది పథకానికి పూర్తిగా మంగళం పాడేశారు. వైఎస్ జగన్ గారి ఆదేశాలతో వైయస్ఆర్‌సీపీ ఆందోళనలతో ప్రభుత్వం దిగివచ్చి రెండో ఏడాది పథకాన్ని అమలు చేయక తప్పలేదు. ఈ పథకానికి రూ. 6,377 కోట్లు మాత్రమే విడుదల చేసింది. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య 87 లక్షలుంటే ఈ ఏడాది కేవలం 66 లక్షల మందికి మాత్రమే పథకాన్ని అమలు చేస్తున్నారు. అందుకు రూ. 10,126 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. - విద్యార్థులకు రూ. 22 వేల కోట్ల బకాయిలు 87 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున చెల్లిస్తే ఏడాదికి రూ. 13,112 కోట్లు అవసరం. మూడేళ్లలో ఈ పథకానికి రూ. 39 వేల కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం కేవలం రూ. 17 వేల కోట్లు. పేద విద్యార్థులకు దాదాపు రూ. 22 వేల కోట్లు బకాయిలు పెట్టాడు. పేద విద్యార్థుల భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఆందోళన చంద్రబాబుకి పట్టడం లేదు. తల్లికి వందనం అనేది ఒక పథకంగా చూడకూడదు. పేద విద్యార్థుల తలరాతలు మార్చడానికి అమ్మ ఒడి పేరుతో వైఎస్ జగన్ గారు సృష్టించిన ఒక విద్యావిప్లవం. తల్లికి వందనం పథకం పేరుతో రెండేళ్లుగా విద్యార్థులకు బకాయిలు పెట్టిన ప్రతి రూపాయినీ చెల్లించాలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఎలాంటి కొర్రీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి పథకాన్ని బేషరతుగా అమలు చేయాలి. పథకాన్ని అమలు చేయకుండా తప్పించుకునే మార్గాలు వెతకడం మానుకోవాలి. విద్యార్థులకు అన్యాయం జరిగితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. అక్రమ కేసులు, నిర్బంధాలు పెట్టినంత మాత్రాన భయపడి వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తల్లికి వందనం మాత్రమే కాదు, సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేదాకా వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని రమేష్ గౌడ్ హెచ్చరించారు.