తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని వైయస్ఆర్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప నాయుడుపై, తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమను లోపలికి అనుమతించకపోవడమే కాకుండా, అక్కడికి వచ్చిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 200 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేశారని, జిల్లా ఎస్పీ, ఏఎస్పీ అధికార పార్టీ ఒత్తిడికి లోనై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి మండలంలో ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి, తప్పుడు కేసులు, వేధింపులకు గురవుతున్న ప్రజలు, పార్టీ నాయకులకు న్యాయ సహాయం అందిస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటించారు. తమ కుటుంబంపై గతంలోనూ అనేక తప్పుడు కేసులు నమోదు చేసినప్పటికీ వెనక్కి తగ్గలేదని, అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ అని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్న ఆయన, ప్రజల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ అంశాలన్నింటిపై న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.