ఆస్పరి: సకాలంలో వర్షాలు కురవక ఆలూరు నియోజకవర్గంలో కరువు పరిస్థితులు నెలకొన్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మండిపడ్డారు. పంటలను కాపాడుకునేందుకు ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.2 వేలు వెచ్చించాల్సిన దుస్థితిలో రైతులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇన్ని కష్టాలు పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వారి బాధలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఆస్పరి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం రైతు పొలంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.2 వేలతో ట్యాంకర్ నీరు కొంటున్నాం సకాలంలో వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను కాపాడుకోవడానికి ఒక్కో ట్యాంకర్ నీటికి రూ.2 వేలు చెల్లించి పొలాలకు నీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్పరి మండలంతో పాటు ఆలూరు నియోజకవర్గమంతటా రైతులు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అయినా కూటమి ప్రభుత్వానికి రైతుల కష్టాలపై కనికరం లేదు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. ఈ ప్రభుత్వాన్ని మేల్కొలిపే వరకు రైతుల తరఫున పోరాడతాం. గిట్టుబాటు ధరల్లేవు.. యూరియా కోసం క్యూలు పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కని పరిస్థితుల్లో అన్నదాతలు రోడ్డున పడుతున్నారు. మరోవైపు ఎరువులు, ముఖ్యంగా యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. రైతులారా.. అధైర్యపడొద్దు రైతుల కష్టాలు మాకు తెలుసు. ఎవరూ అధైర్యపడొద్దు. వైయస్ఆర్‌సీపీ ప్రతి రైతుకూ అండగా ఉంటుంది. మరో మూడేళ్లలో మళ్లీ రైతుల ప్రభుత్వం వస్తుంది. అన్నదాతలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కార్యక్రమంలో మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ మాజీ సభ్యులు, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.