అనంతపురం: వైయస్ఆర్‌సీపీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య సమర్థవంతమైన అనుసంధాన వేదికగా 'జగనన్న 2.0 సూపర్ యాప్` పని చేస్తుందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని హెచ్‌ఎల్‌సీ కాలనీలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జగనన్న 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతూ, అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య నిరంతర అనుసంధానం కల్పించడంతో పాటు పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో జగనన్న 2.0 సూపర్ యాప్ రూపొందించబడిందని తెలిపారు. పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారం, ఉద్యమాలు, కార్యక్రమాలు, ప్రకటనలు ఒకే వేదికపై అందుబాటులో ఉండే ఈ యాప్‌ను ప్రతి వైయస్ఆర్‌సీపీ నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంలో జగనన్న 2.0 సూపర్ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.