అపర భగీరథుడు డా. కేఎల్ రావుకు ఘన నివాళులు

విజయవాడలో జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 

విజయవాడ: భారత జలవనరుల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన పద్మభూషణ్ డాక్టర్ కానూరి లక్ష్మణరావు (కేఎల్ రావు) జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, వైయ‌స్ఆర్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ సీఈసీ సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, డాక్టర్ కేఎల్ రావు దేశ జలవనరుల అభివృద్ధికి జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత ఇంజనీర్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను "అపర భగీరథుడు", "ఖాదీ ఇంజనీర్"గా దేశ ప్రజలు గౌరవించారని అన్నారు. 1957లో ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ చేసిన అనంతరం ప్రజాసేవలోకి అడుగుపెట్టి, 1962 నుంచి 1977 వరకు వరుసగా మూడు పర్యాయాలు విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రిగా విశేష సేవలందించారని గుర్తుచేశారు.  స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణానికి ఆధునిక ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టులే నిజమైన దేవాలయాలని భావించి, భారతదేశాన్ని నీటి వనరుల విషయంలో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కేఎల్ రావు పనిచేశారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలనే కుటుంబ ప్రయోజనాల కంటే గొప్పవిగా భావించిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. 1902 జూలై 15న జన్మించిన డాక్టర్ కేఎల్ రావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఆయన చూపిన దారిలో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని డాక్టర్ కేఎల్ రావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
 

Back to Top