భీమవరం: చంద్రబాబు ఎప్పుడు వచ్చినా, రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతారని, ఇంకా ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా మారుతుందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు కూడా ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర లేదని, మరోవైపు ఆక్వా సాగు రంగం దుర్భరస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆయన గుర్తు చేశారు. ఒకవైపు ఆక్వా సీడ్, ఫీడ్ ధరలు దారుణంగా పెరగ్గా, మరోవైపు పంట కొనుగోలు ధరలు పతనమయ్యాయని చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ఇదే పరిస్థితి కొనసాగుతోందన్న ఆయన, పలు అంశాలు ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వైయస్ జగన్, వారికి భరోసా ఇచ్చారు. ‘నేను ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు’ అంటూ ఆక్వా రైతులకు ధైర్యం చెప్పారు. రాబోయేది తమ ప్రభుత్వమే అన్న శ్రీ వైయస్ జగన్, తాము రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తామని, ‘అప్సడా’కు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. భీమవరంలో ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమంలో శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: సమస్యల సుడిగుండంలో ఆక్వా రంగం: ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటిలో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగం. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా, ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉంది. కాగా, ఆక్వా రంగంలో అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హేతుబద్ధత లేకుండా ధరల పెంపు: ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు ఐదు లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఈరోజు ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటా పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష జరగాలి. అలాగే దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబరు, నవంబరు నెలల్లో, హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా అందుబాటులో ఉన్న కారణంలో ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపైనే ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. సిండికేట్‌దే పెత్తనం. అంతా ఏకపక్షం: మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. చంద్రబాబునాయుడుగారి చర్మము కొంచెం మందం. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. ఈరోజు మన కర్మ ఏమిటి అని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబునాయుడుగారి సానుభూతి పరులవే. దాంతో వాళ్ళు ఎలా కావాలి అని అంటే వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు ఆ సీడ్ రేటు ఎంతో, వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఆ ఫీడ్ రేట్ ఎంతో, కూడా వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్‌గా ఏర్పడి, రేట్లు డమాల్ చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడుగారి సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతున్న పరిస్థితి మనందరికీ కనిపిస్తోంది. సిండికేట్‌కు పండగ. రైతులకు కన్నీళ్లు: చంద్రబాబుగారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్‌కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, అది వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. అప్పుడు మన పాలన ఎలా జరిగిందో కూడా కాస్త గుర్తు చేస్తాను. ‘అప్సడా’తో ప్రతి అడుగులో అండ: గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్‌లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా, ఆరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. రూ.16 పెంచారు. రూ.2 తగ్గించారు: కానీ, ఈరోజు ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. మరి చంద్రబాబునాయుడుగారు వారిని ఎందుకు నివారించలేకపోతున్నారని గట్టిగా నిలదీçస్తున్నాను. కేవలం నాలుగు నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్‌లో, అంటే నాలుగు నెలలు కూడా తిరగకముందే మళ్లీ రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని థిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచుకుంటూ పోయారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబుగారు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నేను అడుగుతున్నాను. నాలుగు నెలలు తిరగకముందే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ?. ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి?. ఇది ఎలా ఉంది అంటే.. చంద్రబాబుగారి భాషలో చెప్పాలంటే.. 100 కొరడా దెబ్బలు కాదు, 98 కొరడాలే అని చెప్పినట్లుగా ఉంది. మరి అప్పుడు ధరలు ఎందుకు తగ్గించలేదు?: చంద్రబాబునాయుడుగారిని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బ్రతుకుతుంది?. ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్ళు, అందుకోసం వాడే ఈ సోయా, ఈ ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నాం. రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. మరి నేను అడుగుతున్నాను. వీళ్ళు ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నారు. సరే, మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా? అని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా సరే. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్‌లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉంది అని చెప్పి, ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. నాడు ‘అప్సడా’ కొరడా: నాడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ అయిదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించడం జరిగింది. ఆ విషయం నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర, ఏ రైతుకు తగ్గకుండా ఆ అయిదేళ్లలో రైతాంగానికి తోడుగా ఉన్న పరిస్థితులు ఒక్క మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర రూ.230కి 100 కౌంట్ తగ్గకూడదు అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది అని కూడా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడంతా సీన్ రివర్స్: అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కి పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి, ఆ రేటు రూ.230 దాటని పరిస్థితి. నేను అడుగుతున్నాను. ఒకవైపునేమో సీడ్, ఫీడ్ రేట్లు పెరుగుతున్నాయి. మరోవైపు పంట కొనుగోలు రేటు చూస్తే అది తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుంది? అని చంద్రబాబునాయుడుగారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాను. అయ్యా, చంద్రబాబుగారు, ఈ సిండికేట్‌తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నాను. నాడు రూ.1.50కే యూనిట్ విద్యుత్: ఇంకా ఆక్వా రైతాంగానికి అండగా నిలబడిన అడుగులు ఎప్పుడు పడ్డాయి అంటే, అది వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. అది కూడా ఒక్క మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వమే అమలు చేసిందని గర్వంగా చెప్పగలను. మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు అందుకోసం ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబుగారి పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత జగన్ పాదయాత్ర మొదలైన తర్వాత, తాము అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50 కే ఇస్తామని చెప్పడంతో, 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడుగారు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కి తగ్గిస్తూ జీఓ జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నాను. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం: చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏ మాదిరిగా చంద్రబాబునాయుడుగారు మోసాలతో అడుగులు ముందుకు వేసాడో, ఎన్నికలప్పుడు బాండ్లు ప్రతి ఇంటికి పంపిణీ చేసి ఏ మాదిరిగా ప్రజలను మోసం చేశాడో, అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. ఇది ఎన్నికల ముందు చంద్రబాబునాయుడుగారు ఇచ్చిన మ్యానిఫెస్టో. (అంటూ ఆ మ్యానిఫెస్టో ప్రతిని సమావేశంలో శ్రీ వైయస్ జగన్ చూపారు) ఆ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ.. అవసరమైన జిలాలోల 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్‌లు అన్నాడు. మరి కట్టాడా అని అడుగుతున్నాను. జోన్‌తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి ఇచ్చాడా అని అడుగుతున్నాను. చంద్రబాబునాయుడుగారు ట్రాన్సా్ఫర్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు. మరి తగ్గించాడా అని అడుగుతున్నాను అంటూ, గట్టిగా ఇలా ఇలా ఇలా అని చెప్పండి. ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు. మరి ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఇలా ఇలా ఇలా అని చెప్పండి. ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్‌ను కూడా చంద్రబాబునాయుడుగారు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీఓ జారీ చేశారు. జీఓ ఆర్‌టీ నెం:169. దాని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటర్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటెన్ చేయాలని చంద్రబాబుగారు రైతులకు రూల్ పెట్టాడు. నేను అడుగుతున్నాను. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటర్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో çపవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్ళీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు. 12 వేల కనెక్షన్లు పెండింగ్: మరోవైపు చూస్తే కొత్తగా ట్రాన్సా్ఫర్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం లేదు. ట్రాన్సా్ఫర్మర్లు కూడా ఇవ్వడం లేదు. కానీ, పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) పేరుతో చంద్రబాబుగారు ఆక్వా రైతులను అన్యాయం చేస్తున్నాడు. ఇంకా కోతల మీద కోతలు వేస్తున్నాడు. ట్రాన్సా్ఫర్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో ఆ రైతాంగం జనరేటర్లు పెట్టుకొని ఆక్వా సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నాను. జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా? అని అడుగుతున్నాను. నాడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో..: నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వాసాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. అంతే కాకుండా ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు, ఆక్వా ల్యాబ్‌ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. ఇంకా మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబుగారు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు. అందుకే ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను.మనసున్న పాలకుడు ఉంటే, రైతాంగం పట్ల నిజమైన ప్రేమ చూపించే పాలకుడు ఉంటే అంతా మంచి జరుగుతుంది. అందుకు ఇవీ ఉదాహరణలు. గణనీయంగా ఉత్పత్తి. ఎగుమతులు. అవార్డులు: మన ప్రభుత్వ హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అంతకు ముందు చంద్రబాబుగారి హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షలు టన్నులు కాగా, మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఆ రంగంలో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల, రైతాంగం చేతిలో చేయి వేసి నడిపించినందు వల్ల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబుగారి పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఆ ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–23 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. అంతే కాదు, చంద్రబాబునాయుడుగారి హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అలా ఆ అవశేషాలు తగ్గించగలిగాం కాబట్టే, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇంకా ఆ రైతాంగాన్ని చేయి పట్టుకొని నడిపించగలిగాం కాబట్టే ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. ఇవన్నీ మనసున్న ప్రభుత్వం మనసు పెట్టి చేస్తే రైతులను ఎలా ఆదుకోగలుగుతుంది, రైతులకు ఎలా తోడుగా నిలబడగలుగుతుంది అని చెప్పడానికి.. అలాగే రెండు ప్రభుత్వాల మధ్య తేడా కనిపించేట్టుగా మీ అందరికీ వివరించడం జరిగింది. ‘నేను ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు’: ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ‘మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను’ అని మాత్రం మీ అందరికీ చెబుతున్నాను. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ ‘ఆప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం ఛైర్మన్‌గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్‌ను కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. రైతులు రోడ్డెక్కుతున్నా పట్టని కూటమి ప్రభుత్వం: నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. పరిస్థితి ఒక్కసారి చూస్తే వరుసగా రెండేళ్ళు పొగాకు పంటకు గిట్టుబాటు ధర రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు, ఏ పంట చూసుకున్నా కూడా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. ఉచిత పంటల బీమా లేకుండా పోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సమయానికే ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీ కనబడకుండా పోయిన పరిస్థితులే కనిపిస్తాయి. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈరోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తోడుగా ఉంటాడని ఈ సందర్భంగా మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. మీ అందరి ప్రేమానురాగాలకు, మీ ఆప్యాయతకు రెండు చేతులు జోడించి, పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానని శ్రీ వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.