మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు 

కాకినాడ: మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై పోలీసులు బీఎన్‌ఎస్‌ 132, 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం మృతి అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించవద్దని కుటుంబ సభ్యులు స్పష్టంగా తెలియజేసినప్పటికీ, ప్రభుత్వం అధికార లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించడాన్ని అంబటి రాంబాబుతో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న సిబ్బందిని తోసివేశారని ఆరోపిస్తూ ఏఆర్ ఎస్‌ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు పోలీసు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలను స్పష్టంగా తిరస్కరించినప్పటికీ, వారి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించి, అనంతరం ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపేనని వారు విమర్శించారు.
 

Back to Top