అనంతపురం: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వెళ్తుండగా ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అరెస్టును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ అక్కడే ధర్నా నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. అరెస్టు అనంతరం శ్రీనగర్ కాలనీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అరెస్టును వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ప్రతిపక్ష గొంతును పోలీసు బలంతో అణచివేసే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.