నంద్యాలలో మహానేత వైయ‌స్ఆర్ కాంస్య విగ్రహావిష్కరణ

జనసంద్రంగా మారిన నంద్యాల.. మహానేతకు ఘన నివాళులు

రానున్నది జగనన్న పాలన.. మళ్లీ రాజన్న రాజ్యమే: కల్పలతా రెడ్డి

నంద్యాల: మహానేత డాక్టర్ వైయ‌స్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస సెంటర్‌లో మహానేత కాంస్య విగ్రహాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఘనంగా ఆవిష్కరించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నివాసం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా, నంద్యాల పట్టణం వైయ‌స్ఆర్ నినాదాలతో మార్మోగింది.

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జి డాక్టర్ ధారా సుధీర్, ఎమ్మెల్సీలు క‌ల్ప‌ల‌తారెడ్డి, ఇసాక్ బాషా తదితరులు కలిసి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మహానేతకు గజమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి మాట్లాడుతూ, మహానేత విగ్రహావిష్కరణకు అశేష జనవాహిని తరలిరావడం వైయ‌స్ఆర్‌పై ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. వైయ‌స్ఆర్ హయాంలో అమలైన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదని, అదే సంక్షేమ బాటలో శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందించారని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కుట్రలతో మహానేత విగ్రహాలను తొలగించవచ్చేమో గానీ ప్రజల గుండెల్లో ఉన్న రాజన్నను ఎవ్వరూ చెరపలేరని స్పష్టం చేశారు. గతంలో ధ్వంసమైన విగ్రహం స్థానంలో మరింత శాశ్వతంగా నిలిచేలా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. 2009లో మహానేత భౌతికంగా దూరమైనా, 2026లోనూ లక్షలాది మంది అభిమానులు ఆయనను గుండెల్లో పెట్టుకుని స్మరించుకోవడం ఆయన ప్రజాదరణకు నిదర్శనమన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో రెండో అంకం ప్రారంభమైందని, త్వరలో శ్రీ వైయ‌స్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో వైయ‌స్ఆర్‌సీపీకి ప్రజా మద్దతు మరింత పెరుగుతుందని జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో నంద్యాల నుంచే విజయప్రస్థానం ప్రారంభించి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నంద్యాల ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
 

Back to Top