చెన్నై: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ తమిళనాడు కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ప్రజాసేవ, సంక్షేమ పాలన, రైతులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. వైయస్ఆర్‌సీపీ తమిళనాడు నాయకుడు జకీర్ హుస్సేన్ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానేత అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో తీసుకువచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రజాకేంద్రిత పాలన నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ఈ సందర్భంగా మహానేత వైయస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుండాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. విదేశాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మహానేత వైయస్ఆర్ భావజాలాన్ని విస్తృతంగా చాటిచెప్పేందుకు వైయస్ఆర్‌సీపీ నిరంతరం కృషి చేస్తుందని వారు స్పష్టం చేశారు.