తాడేపల్లి: మహానేత డాక్టర్ వైయస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రపంచం గర్వించదగ్గ ప్రజానాయకుడని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకొచ్చాయని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహానేత 77వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెలగపూడి శ్రీనివాస్, శైలజానాథ్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ రుహుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైయస్సార్సీపీ నేతలు ఎవరేమన్నారంటే... చంద్రబాబు పాలనలో రాష్ట్రం కారుచీకట్లోకి వెళ్లింది. మళ్లీ వైయస్సార్సీపీ పాలన రావడం ఖాయం: సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్. దివంగత మహానేత వైయస్సార్ వ్యక్తిత్వం, సమస్యల పట్ల ఆయన స్పందించే విధానం చిరస్మరణీయం. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు గతంలో ఎవరూ ఊహించనివి. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడానికి ఆ రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయినా, తన పూచీకత్తుపై అమలు చేసి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. నాడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఒక చిన్నారి పెద్దయ్యాక సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై వైయస్ జగన్‌ను కలవడం వైయస్సార్ విజనరీకి నిదర్శనం. పాదయాత్ర తర్వాత వైయస్సార్‌లో పెద్ద మార్పు వచ్చింది. అంతవరకు తన అనుకున్నవారి కోసం నిలబడే ఆయన, పాదయాత్ర తర్వాత రాష్ట్ర ప్రజలందరినీ తన కుటుంబంగా చూశారు. ఐదేళ్ల నాలుగు నెలల పాలనలో ప్రతి క్షణం ప్రజల కోసమే తపించారు. ఆయన వారసుడిగా వైయస్ జగన్ తండ్రికి మించిన పట్టుదల, దార్శనికతతో పనిచేశారు. ఓదార్పు యాత్రలో బాధితులకు చేసిన సాయాన్ని బయటకు చెప్పడం వారిని చిన్నచూపు చూడటమే అవుతుందని భావించిన విలువలున్న నాయకుడు వైయస్.జగన్ . సీఎం అయిన తర్వాత రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను మంజూరు చేస్తూ.. 'మన దృష్టికి వచ్చినప్పుడు చేయడం ధర్మం' అని సానుకూల నిర్ణయం తీసుకున్న గొప్ప గుణం వైయస్.జగన్ సొంతం. 2019-24 పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపించారు. వైయస్సార్, చంద్రబాబు ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా చంద్రబాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అయినా కేవలం 5 ఏళ్లలోనే వైయస్సార్ చరిత్ర సృష్టిస్తే.. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు. 2024లో అడ్డగోలు పొత్తులతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీరు మారలేదు. గతంలో కంటే పదింతలు అబద్ధాలు చెప్పి, ఓట్లేసిన ప్రజలను నమ్మించి మోసం చేసి పాతాళంలోకి నెట్టేశారు. కేవలం రెండేళ్లు పూర్తి కాకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానిది. 'వెన్నుపోటుకి రెండేళ్లు' అని మనం చేసిన కార్యక్రమాలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రంలో దోపిడీ భయంకరంగా సాగుతోంది. మాట్లాడినా, రాసినా అక్రమ అరెస్టులు, కేసులు పెడుతూ కారుచీకటి పరిస్ధితులు తెచ్చారు. ప్రస్తుత పాలకుల వల్ల ప్రజలకు వెలుగు విలువ తెలిసొచ్చింది. రానున్న రోజుల్లో వైయస్సార్ స్ఫూర్తితో, వైయస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ వైయస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రంలో అభివృద్ధిని ‘వైయస్సార్‌కు ముందు.. వైయస్సార్‌కు తర్వాత’ అని చెప్పుకుంటారు: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు కూడా దివంగత నేత వైయస్సార్ వ్యక్తిత్వాన్ని, ఆయన దార్శనికతను వేనోళ్ల పొగిడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి పనులను చూస్తే.. రాష్ట్రంలో 'వైయస్సార్‌కు ముందు, వైయస్సార్‌కు తర్వాత' అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆయన చేపట్టిన ప్రతి పనినీ నిబద్ధతతో చేశారు. 15 ఏళ్ల క్రితం వినుకొండ ప్రాంతంలోని విట్టంరాజుపల్లె గ్రామంలో వైయస్సార్ విగ్రహావిష్కరణకు వెళ్లినప్పుడు ఒక బలహీన వర్గానికి చెందిన మహిళ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న తన మనవడిని వైయస్సార్‌ను కలిసి వేడుకోగా, ఆయన వెంటనే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 'వైయస్సార్ మా మనవడి గుండెల్లో కొలువై ఉన్నాడు, ఆయనను ఎవరు దూరం చేయగలరు?' అని ఆమె అంది. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ, 108 వంటి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన అకాల మరణం మనల్ని కలిచివేసినా.. వైయస్ జగన్ అనే ఆణిముత్యాన్ని మనకు అందించారు. వైయస్సార్ అభివృద్ధిలో రెండడుగులు వేస్తే.. జగనన్న నాలుగు అడుగులు వేసి రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రైతులు ఇంకా వ్యవసాయం చేస్తున్నారంటే దానికి కారణం వైయస్సార్ ఉచిత విద్యుత్తే: శైలజానాధ్, మాజీ మంత్రి. దివంగత ప్రియతమ నేత వైయస్సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేడు రైతులు కాడె వదిలేయకుండా వ్యవసాయం చేస్తున్నారంటే దానికి కారణం వైయస్సార్ ప్రవేశపెట్టిన గొప్ప పథకం ఉచిత విద్యుత్. ఆ రోజుల్లో మేం ప్రజల్లోకి వెళ్తే.. 'మీకు ఆరోగ్యం బాగాలేకపోతే చూసేవాడు రాజశేఖరరెడ్డి, మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా పెద్ద కొడుకులా చూసుకునే వ్యక్తి వైయస్సార్' అని ధైర్యంగా చెప్పేవాళ్లం. పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చాలని కులం, మతం, పార్టీలు చూడకుండా దాదాపు 80 లక్షల ఇళ్లు నిర్మించిన మహానుభావుడు ఆయన. బంతిలో కూర్చుంటే పక్షపాతం ఉండకూడదని, పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేయాలని మాకు చెప్పేవారు. చంద్రబాబు హయాంలో హాస్టల్ పిల్లల మెస్ ఛార్జీలు పెంచకపోతే.. వైయస్సార్ దగ్గరకు వెళ్లి అడిగిన వెంటనే 300 శాతం స్కాలర్‌షిప్‌లు పెంచిన పెద్ద మనసు ఆయనది. నల్గొండ జిల్లాకు చెందిన ఒక దివ్యాంగ బాలిక కాక్లియర్ ఇంప్లాంట్ కోసం రూ.10 లక్షలు ఖర్చవుతుందని వస్తే, అధికారులు వద్దన్నా వినకుండా మధ్యాహ్నానికల్లా డబ్బులు మంజూరు చేసిన గొప్ప మానవతావాది వైయస్సార్. కానీ నేడు దివంగత నేత కన్న కలలకు కష్టం వచ్చింది. ప్రజలను బాధపెట్టే, వారి నుంచి పైసలు లాక్కునే దౌర్జన్యపూరిత ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి దౌర్జన్యాలను ఎదురించే దమ్మున్న వైయస్సార్ శిష్యులుగా మనమందరం పోరాడాల్సిన సమయమిది. ఇందుకోసం వైయస్ జగన్ నేతృత్వంలో మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. వైయస్సార్ పాదయాత్ర దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చింది: జోగి రమేష్, మాజీ మంత్రి. డాక్టర్ వైయస్సార్ ప్రజల గుండెల్లో దేవుడు, నా రాజకీయ గురువు. రాజన్న చేసిన పాదయాత్ర దేశ చిత్రపటాన్ని మార్చేసింది. ఆయన పాదయాత్ర కేవలం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే కాదు.. 2004, 2009 లలో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమైంది. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లే అప్పటివరకు కార్పొరేట్ వర్గాలకే పరిమితమైన ఇంజనీరింగ్, మెడికల్ చదువులు పేదల ముంగిటకొచ్చాయి. లక్షలాది మందికి ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలను ఓదార్చడానికి 'నేనున్నాను' అంటూ జగనన్న ముందుకు వస్తే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. అలాంటి సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని డీకొట్టి, వైయస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ధీరుడు వైయస్ జగన్. మనమందరం వైయస్.జగన్ కు అండగా ఉంటూ, మరలా ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చంద్రబాబు వెన్నుపోటు దారుడు.. వైయస్సార్ సంక్షేమానికి మారుపేరు: వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పరిచయం అక్కరలేని గొప్ప వ్యక్తి డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి. 2004లో ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి గొప్ప పథకాలు వచ్చేవి కావు. చంద్రబాబు తాను సీనియర్ అని, ప్రధానులను నిర్ణయించానని చెప్పుకుంటాడు కానీ, ఆయన చరిత్రలో పేదల సంక్షేమం కోసం చేసిన ఒక్క పథకమైనా ఉందా? కేవలం వెన్నుపోటు ద్వారా సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు వైయస్సార్ అయితే, ఆయన అడుగుజాడల్లోనే వైయస్ జగన్ పనిచేస్తూ ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తూనే, ప్రాథమిక విద్య కోసం అమ్మఒడి తెచ్చారు. చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో అన్ని వర్గాలకూ న్యాయం చేశారు. అలాంటి వైయస్సార్ పాలన మళ్లీ రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా రానున్న ఎన్నికల్లో వైయస్ జగన్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి.