గుడివాడ: రావణ్ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ అంశంలో వైయస్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం టీడీపీ తప్పుడు కథనాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. 2029 ఎన్నికల్లో ప్రజలు పరశురాముడి గొడ్డలితో చంద్రబాబు ప్రభుత్వాన్ని రాజకీయ సమాధి చేస్తారని, ఆ మాటకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు. రావణ్‌ను జోసఫ్‌గా మార్చింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని, కమ్మ వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్‌గా చిత్రీకరించింది టీడీపీ, ఎల్లో మీడియా, పేటియం బ్యాచ్ అని ఆరోపించారు. కుటుంబ సభ్యుల మాటలను కూడా పట్టించుకోకుండా రావణ్ ఐడెంటిటీని మార్చేశారని అన్నారు. రావణ్ పేరు రావణే తప్ప జోసఫ్ కాదని, అతను క్రిస్టియన్ కూడా కాదని స్పష్టం చేశారు. రావణ్ అరెస్టు తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించి కేసు సెక్షన్లు పరిశీలించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. జనసైనికులు పెట్టిన కేసుల్లో రావణ్‌కు బెయిల్ ఇప్పించింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కానీ, వైయస్ఆర్‌సీపీ నాయకులు కానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదన్నారు. బెయిల్ రావడంలో చంద్రబాబు పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. జనసేన హడావుడి ఆగకపోవడంతో కఠిన చట్టాలు ప్రయోగించి రావణ్‌ను జైలుకు పంపారని ఆరోపించారు. రావణ్ జగన్‌ను విమర్శిస్తాడని, పవన్ కళ్యాణ్‌ను అంతకంటే ఎక్కువగా విమర్శిస్తాడని, కానీ చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడడని అన్నారు. గత వీడియోలు పరిశీలిస్తే రావణ్ ఎవరికి అనుకూలంగా వ్యవహరించాడో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. నక్సలైట్లకు అనుకూలంగా ఏడాది క్రితం మాట్లాడిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసులు పెట్టడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం రావణ్‌పై అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ సాధ్యమయ్యేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో వైయస్ఆర్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని, రావణ్ అరెస్టుతో తమకు ఎలాంటి నష్టం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబును నమ్ముకుంటే జనసేన రాజకీయంగా నష్టపోతుందని, రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు. పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటకు విలువ లేదని, రాష్ట్రంలో యాక్టింగ్ సీఎం లోకేష్ చెప్పిందే జరుగుతోందని విమర్శించారు. టీడీపీ ఈ అంశంపై అబద్ధపు కథనాలు సృష్టించడం మానుకోవాలని, ఆ బురదను వైయస్ఆర్‌సీపీపై చల్లే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. హిందువులు, క్రిస్టియన్లు కలిసి మెలిసి జీవిస్తున్నారని, ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొంటూ, రాజకీయ కుట్రలతో ప్రజలను విభజించే ప్రయత్నాలు ఫలించవని కొడాలి నాని అన్నారు.