మచిలీపట్నం: రాష్ట్రంలో రెండేళ్ల కూటమి పాలనలో హోంగార్డుల జీవితాలు దయనీయంగా మారాయని, ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. కూటమి నేతలు హోంగార్డులపై చూపుతున్న వివక్ష కారణంగా వారి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో మచిలీపట్నంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పేర్ని నాని వివరించారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెంచిన వేతనాలే అమలవుతున్నాయని, వారికి ఇప్పటికైనా తెలంగాణతో సమానంగా వేతనాలు పెంచాలని పేర్ని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వారి కుటుంబాలకు కానిస్టేబుళ్ల తరహాలోనే ఆరోగ్య భద్రత, జీవిత బీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలని పేర్ని నాని కోరారు. ప్రెస్ మీట్లో పేర్ని నాని ఇంకేమన్నారంటే... కూటమి సర్కార్ లో హోంగార్డుల దుస్దితి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నడుపుతున్న కూటమి ప్రభుత్వంలో బాధపడని, వంచనకు గురికాని వర్గం ఏ ఒక్కటీ లేదు. ఇందులో సుమారు 15-16 వేల మంది పనిచేస్తున్న హోంగార్డుల వ్యవస్థ కూడా ఒకటి. చట్టబద్దత కల్పించబడిన వెట్టిచారికీ ఉద్యోగం వీళ్లది. గొర్రె తోక బెత్తెడు అన్న సామెత చందంగా వీరి జీవితాలు ఉన్నాయి. ఇప్పటికీ రోజుకు రూ.710 వేతనంతో వీళ్లు పనిచేస్తున్నారు. 31 రోజుల నెల ఉంటే 21, 010 వేతనం తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని 18 వేలుగా ఉన్న వీరి జీతం కాస్తా 21 వేలకు చేరింది. నెలకు వేతనంతో కూడిన రెండు సెలవులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీరికి ఇచ్చింది. ఆ రెండు రోజులు కాకుండా మిగిలిన రోజుల్లో అనారోగ్యం వచ్చి సెలవు తీసుకుంటే కోతలు తప్పవు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ తో పాటు ప్రతీ డ్యూటీ వీరు చేయాలి. శవాల దగ్గర కాపలా ఉండాలి, అనాథ శవమైనా, హత్య జరిగినా వీళ్లే, గొడవలు నియంత్రించడానికి వెళ్లి తన్నులు కూడా తినాలి. ప్రశ్నించి కేసులు కూడా పెట్టకూడదు. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అయితే టీఏలు అయినా ఇస్తారు. కానీ హోంగార్డులకు అవి కూడా లేవు. ఎస్పీ లేదా ఏఆర్ డీఎస్పీ దయతలచి బస్సు పెడితే బందోబస్తులకు వెళ్లాలి, లేదా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్లాలి. నైట్ బీట్లు చేయాలి, కోర్టు సాక్ష్యాలకు వెళ్లాలి, ఇన్ని బాధలు పడుతూ వెట్టి చాకిరీ చేస్తున్న వీరికి, వారి కుటుంబాలకు ఆరోగ్యభద్రత లేదు. తన మీద ఆధారపడిన వారికి కూడా ఆరోగ్య భద్రత కల్పించలేకపోతున్నారు. డ్యూటీ చేస్తూ చనిపోతే ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆ జిల్లాలో తోటి హోంగార్డులంతా కలిసి ఒకరోజు వేతనం వేసుకుని ఇస్తున్నారు. పోలీసు వెల్ఫేర్ నుంచి ఎస్పీ కానీ డీజీపీ కానీ డబ్బులు తీసి ఇవ్వరు. హోంమంత్రి మాత్రం కానిస్టేబుళ్లకు స్టయిఫండ్ అడగ్గానే సీఎం గారు ఇచ్చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంట్లో చదువుకున్న వాళ్లు ఉంటే, వారికి రెండు నెలలకూ, మూడు నెలలకో మళ్లీ అదే ఉద్యోగం ఇస్తారు. హోంగార్డులకు కూటమి ఇచ్చిన హామీల అమలేదీ ? ఐపీఎస్ జయలక్ష్మి కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డులకు సైతం కానిస్టేబుళ్ల తరహాలోనే శారీరక, రాత పరీక్షలు పెట్టి నియామకాలు చేపట్టారు. వాళ్లు కూడా రికమండేషన్ ద్వారా రాలేదు, నేరుగానే వచ్చారు కాబట్టి వారికి కూడా కానిస్టేబుళ్లతో సమానంగా సదుపాయాలు ఇవ్వాలి. హోంగార్డుల పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ అర్హత కల్పించారు. ఇంట్లో వితంతువు ఉంటే ఇప్పటికీ పెన్షన్ ఇవ్వట్లేదు. వెట్టి చాకిరీ చేయించుకుంటూ హోంగార్డులకు భద్రత కానీ, ఆరోగ్య భద్రత కానీ కల్పించడం లేదు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హోంగార్డుల గురించి ఎన్నో మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే ఈ కానిస్టేబుల్ కొడుకు హామీ ఇస్తున్నా అంటూ చాలా మాటలు చెప్పారు. యువగళంలో నారా లోకేష్ కూడా హోంగార్డుల్ని ఉద్ధరించకపోతే కాలర్ పట్టుకుని అడగమని లోకేష్ చెప్పాడు. కానీ రెండేళ్లలో వారి జీవితాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఈ రెండేళ్లలో వారి రోజువారీ జీతం 200 పెంచిన వాళ్లు లేరు. ఎంత పనికి అంత జీతం ఇస్తామన్న పవన్ కళ్యాణ్ ఇవాళ హోంగార్డుల్ని ఎందుకు పట్టించుకోరు. తెలంగాణతో సమానంగా వేతనాలు పెంచాల్సిందే పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డులకు 30 వేల రూపాయలు ఇస్తున్నారు. ట్రాఫిక్ డ్యూటీ ఇస్తే అదనంగా మరో 3 వేలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ హోంగార్డులకు అదే మొత్తం ఇవ్వాలి కదా. జీతం పెరగదు, సౌకర్యాలు ఉండవు, ఆరోగ్యం పోతే చూసే దిక్కులేదు, పిల్లల చదువు పట్టించుకునే వారు లేరు. కాబట్టి తెలంగాణతో ఉన్న హోంగార్డులతో సమానంగా ఇక్కడి హోంగార్డులకు కూడా 39 వేలు ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ తరఫున హోంగార్డుల్ని ఉద్దరిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష ద్వారా తీసుకున్న హోంగార్డుల్ని కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ లో కోటా ఇవ్వాలని కోరుతున్నాం. జీవిత బీమా సౌకర్యం కూడా కల్పించాలి. క్యాష్ లెస్ మెడికల్ ట్రీట్మెంట్ కల్పించాలి. అలాగే వీరి పిల్లల చదువులకు తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలి. ఇంట్లో అర్హత కలిగిన వితంతు, వృద్ధాప్య పెన్షన్లను ఇతరులతో సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వేతనంతో కూడిన సెలవుల్ని మూడుకు పెంచాలి. వీటిని ఆరు మాసాల్లో ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డుల్ని కూడా సమానంగా ఆదరించండి. బందోబస్తుకు పంపినప్పుడు వారికి కూడా కానిస్టేబుళ్లతో సమానంగా టీఏ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. కానిస్టేబుళ్ల విషయంలో గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రస్తావించిన సమస్యల్ని పరిష్కరించారు. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ మాత్రం అమలు చేయడం లేదు. ఆరు వాయిదాలు బకాయి ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలి. కానిస్టేబుల్ కొడుకు అయిన పవన్ కళ్యాణ్.. మీ శాఖ తప్ప అన్ని శాఖలూ పట్టించుకుంటారు కదా.. ఇది కూడా అలాగే పట్టించుకోవాలని పేర్నినాని హితవు పలికారు.